
ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగిన నాగమణి
‘‘ఒకటి కాదు.. రెండు కాదు. మాది 12 ఏళ్ల ప్రేమ. ఇన్నేళ్లపాటు కలిసి తిరిగాం. కాబోయే దంపతులమని నమ్మాను. దగ్గరయ్యాను. రెండుసార్లు గర్భవతినయ్యాను.
♦ ప్రేమించుకున్నారు.. పెళ్లాడాలనుకున్నారు.
♦ పెద్దలకు తెలిసింది.. అభ్యంతరం చెప్పలేదు.
♦ కలిసి తిరిగారు.. కలిసి ఉన్నారు.
♦ మోజు తీరిందేమో..ఆమెకు దూరమయ్యాడు..
♦ మరొకామెకు దగ్గరయ్యాడు.
♦ మోసపోయిన ఆ ప్రియురాలు..
♦ మౌన పోరాటానికి దిగింది.
ఇల్లెందు:
‘‘ఒకటి కాదు.. రెండు కాదు. మాది 12 ఏళ్ల ప్రేమ. ఇన్నేళ్లపాటు కలిసి తిరిగాం. కాబోయే దంపతులమని నమ్మాను. దగ్గరయ్యాను. రెండుసార్లు గర్భవతినయ్యాను. అబార్షన్ చేయించాడు. ఇప్పుడు.. కాదు పొమ్మంటున్నాడు’’ – ఇది ఓ ప్రియురాలి ఆవేదన.
⇔ ఆమె పేరు సిలివేరు నాగమణి. ఇల్లెందు పట్టణంలోని గోవింద్ సెంటర్ నివాసి. అతడి పేరు శేషు. కారు డ్రైవర్. స్థానిక సాయిబాబా టెంపుల్ ఏరియా నివాసి.
⇔ 12 ఏళ్ల క్రితం సాయిబాబా టెంపుల్ సమీపంలో టైలరింగ్ సెంటర్‌లో ఆమె చేరింది. అదే ప్రాంతానికి చెందిన కార్ డ్రైవర్ శేషుతో పరిచయమేర్పడింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
⇔ రెండు కుటుంబాల్లోని పెద్దలకు విషయం తెలిసింది. అభ్యంతరం చెప్పలేదు. అంగీకారం తెలిపారు.
⇔ అప్పటి నుంచి ఆ ప్రేమికులు ఖుషీ ఖుషీగా తిరిగారు. తనువులు దగ్గరయ్యాయి.
⇔ ఆమె రెండుసార్లు గర్భవతయింది. అతడు బలవంతంగా అబార్షన్ చేయించాడు.
⇔ వారు పెళ్లి చేసుకోలేదు. కానీ, ఆమెను తనను భార్యగా పేర్కొంటూ రేషన్ కార్డులో పేరును కూడా నమోదు చేయించాడు.
⇔ ఆమెపై మోజు తీరిందేమో! ఇటీవల మరో యువతితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ప్రియురాలిని దూరం పెడుతున్నాడు.
⇔ ఆమె గ్రహించింది. నిలదీసింది. పెళ్లి చేసుకుందామని మరోమారు ఆమెను నమ్మించాడు.
⇔ పాపం.. ఆ అమాయకురాలు మరోసారి గుడ్డిగా నమ్మింది. ఆమె కుటుంబ పెద్దలు అతడి ఇంటికి వెళ్లి కట్నకానుకలు కూడా మాట్లాడుకున్నారు. అతడు మాత్రం ఆమెకు దూరం దూరంగా ఉంటున్నాడు. ఫోన్ చేస్తే.. ‘‘నువ్వెవరో నాకు తెలియదు’’ అన్నాడు.
⇔ తాను మోసపోయినట్టుగా తెలుసుకుంది. దిక్కుతోచలేదు. తన బస్తీ వాసులు కొందరి అండతో ప్రియుడి ఇంటి ముందు శుక్రవారం టెంట్ వేసుకుని, దాని కింద కూర్చుంది. మౌన పోరాటానికి దిగింది. న్యాయం కోసం మౌనంగా, దీనంగా రోదిస్తోంది. ఆ ఇంటిలో శేషు లేడు. ఎక్కడికో వెళ్లిపోయాడు.
⇔ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. దీక్షకు దిగిన ఆమె వద్దకు ఎస్‌ఐ కొమురెల్లి వెళ్లారు. అందరి నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు.