పోలీసు స్టేషన్ ఎదుట మహిళ ఆందోళన
-
ప్రేమవంచకుని అరెస్టు చేయాలని డిమాండ్
-
సీఐ హామీతో విరమణ
కిర్లంపూడి:
ప్రేమ వివాహం చేసుకుని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని కోరుతూ గ్రామానికిS చెందిన దళిత మహిళ గుడిమెట్ల పుష్ప శుక్రవారం పోలీసు స్టేషన్ ఎదుట కిరోసిన్ డబ్బాతో బైఠాయించి ఆందోళన చేపట్టింది. పోలీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పుష్ప కువైట్‌లో పని చేస్తుండగా అక్కడే తన పక్కింట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి చెందిన గుడిమెట్ల రామకృష్ణాధనారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అన్నవరం సత్యన్నారాయణస్వామి దేవస్థానంలో తాము వివాహం చేసుకున్నామని, ఆతర్వాత కొంత కాలం కాపురం చేసిన రామకృష్ణధనారెడ్డి అతని ఇంటికి తీసుకువెళ్లాడని తెలిపింది. అక్కడ అత్తమామల నుంచి పుష్పకు వేధింపులు ఎదురయ్యాయి. అంతే కాకుండా ఆమె సంపాదించిన ఆస్తిమొత్తం కాజేసి భర్త కూడా కాపురం చేయనని చెప్పి ఇంట్లోంచి గెంటివేశారు. దాంతో గతేడాది జూన్‌లో పుష్ప కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దానిపై ఆమె భర్త, అత్తమామలు, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాది అయినప్పటికీ పోలీసులు వారిపై చర్యలు తీసుకోలేదని ఆమె ఈ ఆందోళనకు దిగింది. న్యాయం చేసే వరకు దీక్ష విరమించబోనని ఆమె భీష్మించింది. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ పి.కాశీవిశ్వనాథం బాధితురాలితో మాట్లాడి వారం రోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించింది. ఈ ఆందోళనలో స్థానిక దళిత నాయకులు బాతు అప్పారావు, మారెళ్లి కృపానందం, గుద్ధాటి అప్పారావు, కట్టు నాగేశ్వరరావు, మూరా రాజ్‌కుమార్, గుద్ధాటి శ్రీను, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.