మద్యం దుకాణాలకు నేడు లక్కీ డిప్
– చివరి రోజు భారీగా టెండర్ల దాఖలు
- రియల్టర్లు, ఫైనాన్స్ వ్యాపారుల దృష్టి
– లైసెన్స్ కాల పరిమితి రెండేళ్లు
– మధ్యాహ్నం 2 నుంచి లక్కీడిప్ ప్రారంభం
– జెడ్పీ సమావేశ భవనంలో ఏర్పాట్లు
కర్నూలు: మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 204 మద్యం దుకాణాలకు చివరి రోజు గురువారం నాటికి సుమారు 4,850 పైగా దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే ఈసారి మరో మూడు గంటలు పెంచి రాత్రి 8 గంటల వరకు టెండర్ల దాఖలుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రాత్రివేళ అసౌకర్యానికి లోనుకాకుండా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించారు.
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వ్యాపారులతో ఎక్సైజ్ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా సందడి కనిపించింది. జిల్లాలో 14 ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్లు ఉండగా.. స్టేషన్ల వారీగా టెండర్ బాక్సులు ఏర్పాటు చేయడంతో ప్రక్రియ సజావుగా సాగింది. మహిళలు కూడా నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు సమర్పించారు. గత ఏడాది పదుల సంఖ్యలో దుకాణాలకు 100 నుంచి 150 దాకా దరఖాస్తులు దాఖలు కాగా.. ఈ ఏడాది వ్యాపారులు సిండికేట్ కావడంతో కొన్ని ప్రాంతాల దుకాణాలకు దరఖాస్తులు తగ్గాయి. గత ఏడాది 175 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించి 19 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. కొంతకాలం తర్వాత వాటికి కూడా టెండర్లను ఆహ్వానించి వ్యాపారులకు అప్పగించారు.
మద్యం వ్యాపారంలోకి కొత్త వ్యక్తులు
గత ఏడాది మద్యం వ్యాపారులు భారీగా లాభాలు గడించారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారంపై కొత్త వ్యక్తులు కూడా దృష్టి సారించారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉండటంతో గతంలో ఆ వ్యాపారంలో స్థిరపడిన వారు, ఫైనాన్స్ వ్యాపారులు నువ్వా.. నేనా అన్నట్లుగా ఎక్సైజ్ టెండర్లలో పాల్గొని దరఖాస్తులు అందజేశారు. రెండేళ్ల కాల పరిమితితో లైసెన్స్ ఇస్తుండటంతో కలసివచ్చే అవకాశంగా భావించి మద్యం వ్యాపారంతో సంబంధం లేని వాళ్లు కూడా ఈసారి లాటరీల కోసం ప్రయత్నిస్తున్నారు. రాబోవు రెండేళ్ల కాలంలో సాధారణ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉండటంతో వ్యాపారం పెద్ద ఎత్తున సాగే అవకాశముందని భావించి ఫైనాన్స్ వ్యాపారులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు, కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు మహేష్‌కుమార్, ఆదినారాయణ మూర్తి పర్యవేక్షణలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెండర్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. గతంలో దుకాణాలు పొందిన వాళ్లు ఈసారి కూడా తమ చేయి దాటకూడదని భావించి అనుచరులు, కుటుంబ సభ్యులతో పదుల సంఖ్యలో దరఖాస్తులు చేయించారు. గత ఏడాది 5,781 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 204 దుకాణాలకు 4,850 దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే అధికారులు 3,292 దరఖాస్తులను పరిశీలించి స్వీకరించారు. 1558 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రాత్రి పొద్దుపోయే వరకు వాటిని పరిశీలించి ఆమోదించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వానికి రూ.20 కోట్లకు పైగా ఆదాయం
దరఖాస్తు ఫీజుగా రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ ఫీజు మండల కేంద్రాల్లో రూ.50 వేలు, నగర పంచాయతీలో రూ.75 వేలు, నగరపాలక సంస్థ పరిధిలో రూ.లక్ష చెల్లించాలి. దరఖాస్తు ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి ఇవ్వరు. ఈ లెక్కన దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది సుమారు రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
నేడు అదృష్ట పరీక్ష
లక్కీడిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకోసం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ హాజరై లక్కీడిప్‌ను ప్రారంభించనున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయంతో పాటు లక్కీడిప్ జరగనున్న జిల్లా పరిషత్ ఆవరణం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మొత్తం దుకాణాలు : 204
దాఖలైన దరఖాస్తులు :
మున్సిపల్ ప్రాంతాలు : 309
కర్నూలు కార్పొరేషన్ : 144
నగర పంచాయతీలు : 99
మండల కేంద్రాలు : 2,740