ప్రధాన రహదారిపై బైఠాయించిన నాయకులు
- రీడిజైన్ల పేరిట సర్కార్ దోపిడీ
- మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శ
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
సంగారెడ్డి మున్సిపాలిటీ: కాంగ్రెస్ హయాంలో ప్రవేశ పెట్టిన ప్రాజెక్టులను రీడిజైన్ పేరిట సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని పీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి విమర్శించారు. మంగళవారం టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో జల పంపకాలపై ఒప్పందం చేసుకోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గత పాలకులు చేసుకున్న ఒప్పందాలనే తప్పు పడుతూ రీడిజైనింగ్ పేరిట తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్లకే పరిమితం చేసే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టుగా అన్ని అవకాశాలుండి కేంద్రం వద్ద ఉన్న ప్రతిపాదనలను కాదని కనీసం డీపీఆర్‌లు కూడా సిద్ధంగా లేని ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఏ రకంగా చూసినా తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసే కుట్ర పూరిత ఒప్పందమని ఆయన తెలిపారు. ప్రాణహితను తమ్మిడి హట్టి వద్దే 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, నాయకులు కుసుమ్‌కుమార్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పటాన్‌చెరు కార్పొరేటర్ శంకర్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని భారీ ర్యాలీ
అంతకుముందు పట్టణంలోని రాంమందిర్ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించడంతో దాదాపు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.