ఒప్పందం ‘మహా’ మోసం
Published Sun, Aug 21 2016 9:31 PM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
కరీంనగర్ సిటీ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మహారాష్ట్రతో ఒప్పందమంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇప్పటికే మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందంటూ సంబరాలు చేసుకున్నారని గుర్తుచేశారు. మళ్లీ ఈనెల 23న మహారాష్ట్రతో ఒప్పందం అంటున్నాడని, అంటే ఇదివరకు చేసుకున్నది ఒప్పందం కాదా అని ప్రశ్నించారు. వారు ఆదివారం కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ 148 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ముందు నుంచి సుముఖంగానే ఉందన్నారు. ఇందులో కేసీఆర్ సాధించిన ఘనత ఏమిటని నిలదీశారు. తాము 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని కోరామన్నారు. మహారాష్ట్రతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందానికి ప్రయత్నించలేదని కేసీఆర్ అనడాన్ని ఖండించారు. 1975లోనే అప్పటి సీఎం జలగం వెంగళరావు మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకొన్నారని చెప్పారు. 2012 మే 5న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పవన్‌కుమార్‌బన్సల్ కార్యాలయంలో మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. వాస్తవాలను కప్పిపుచ్చడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నించడం బాధాకరమన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి నుంచి జైపూర్ మీదుగా సుందిళ్లకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావచ్చన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు ఆ ప్రాజెక్టును రద్దు చేసి మేడిగడ్డ, అన్నారంలో వృథాగా బ్యారేజీలు నిర్మించడం వల్ల రూ.10వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. మిడ్‌మానేరు నుంచి నిజాంసాగర్‌కు కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం, ముంపు లేకుండా నీళ్లు తరలించవచ్చన్నారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్‌కు అక్కడినుంచి నిజాంసాగర్ నీటిని తరలించాలనుకోవడం మూర్ఖత్వమని, కేసీఆర్ భాషలో చెప్పాలంటే మెడమీద తలకాయున్నోడు ఈ పని చేయడని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి నీళ్లతో ఎల్‌ఎండీని నింపే అవకాశమున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎల్‌ఎండీలో నాలుగు టీఎంసీ నీటిని సైతం సిద్దిపేటకు తాగునీటి కోసమే నిలువ ఉంచుతున్నార ని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నారన్నారు. అసలు కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిందెక్కడ, తాము అడ్డుపడ్డదెక్కడని ప్రశ్నించారు. కేసీఆర్ ఇకనైనా వాస్తవ దృక్పథంతో ముందుకెళ్లాలని, ప్రతిపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికారు.
Advertisement