సీఎం కేసీఆర్ అబద్ధాలకోరు..
* రెండేళ్లలో రూ.70 వేల కోట్ల అప్పులే మిగిలాయి
* మంత్రులంతా పాలన వదిలి పాలేరుకు పరుగులా?
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఫైర్
* వ్యాపార ప్రయోజనాల కోసమే పొంగులేటి పార్టీ మారారు
* వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కేసీఆర్ విపరీత బుద్ధి.. అహంకార పూరితంగా అభద్రతాభావంతో చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. సీఎం కేసీఆర్ అబద్ధాలకోరు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని, ఈ రెండేళ్లలో మేమే చేశామని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
రెండేళ్లలో రూ.70 వేల కోట్ల అప్పులే మిగిలాయి. రాష్ట్ర ప్రజలను అప్పులపాలు చేశారు. ప్రజాపాలన గాలికొదిలి మంత్రులంతా పాలేరులో తిరగడం అవసరమా?’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి 70 వేల ఓట్లు, టీడీపీకి 50 వేలు, వైఎస్సార్‌సీపీకి 25 వేల ఓట్లు పాలేరు నియోజకవర్గంలో ఉన్నాయని, ఈ లెక్కలను చూసి భయపడుతున్న మంత్రులు కేటీఆర్, తుమ్మల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. రూ. 2 లక్షల కోట్లతో ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో మరో స్కామ్‌కు తెరలేపారని, ఈ స్కీమ్‌లన్నీ కూడా స్కామ్‌లుగా మారే ప్రమాదం ఉందన్నారు.
13 ఏళ్లు మంత్రిగా ఉన్న తుమ్మలకు అభివృద్ధికి అర్థమే తెలియదనీ, జిల్లాలోని పాలేరుకు అదనపు నీటి కేటాయింపులు ఎందుకు చేయించలేదన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆనాడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రణాళిక తయారు చేయించారని చెప్పారు. ఈ ప్రభుత్వం గోదావరిపై ఒక్క ప్రాజెక్టు అయినా కట్టిందా? అని భట్టి ప్రశ్నించారు.
పొంగులేటి జవాబు చెప్పాలి: కొండా
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాపార, రాజకీయ జీవితం వైఎస్ కుటుంబం చేయూతతోనే ప్రారంభమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరాక.. వైఎస్ విజయమ్మ, జగన్, షర్మిల కష్టపడి ప్రచారం చేస్తేనే ఆయన ఫ్యాన్ గుర్తుపై ఎంపీగా గెలిచారన్నారు. అయితే పార్టీ అధ్యక్ష పదవి, వైఎస్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేశారని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ ఈ నెల 16, 17, 18 తేదీల్లో దీక్ష చేస్తున్నందునే మనస్తాపం చెంది తాను పార్టీ మారినట్లు పొంగులేటి చెబుతున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఏం అన్యాయం జరిగిందో మీకు తెలుసా..? అని ఆయన ప్రశ్నించారు. ఏ అభాండమైతే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మీద మోపారో.. దానికి ఓట్లు వేసి గెలిపించిన ఖమ్మం పార్లమెంట్, పాలేరు నియోజకవర్గ ప్రజలకు పొంగులేటి జవాబు చెప్పాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. సుచరితారెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి.. సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుంటావా..? అని ఎంపీ పొంగులేటిపై ధ్వజమెత్తారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టులకు రూ. 6 వేల కోట్లు ఖర్చు పెడితే 8 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సుచరితారెడ్డికి సంఘీభావం తెలపమని వైఎస్.విజయమ్మ, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తమను పంపారనీ, పాలేరు ప్రజలు ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి సుచరితారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.
వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ప్రచారం
కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డికి మద్దతు తెలుపుతూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు నేలకొండపల్లి మండలం లో జోరుగా ప్రచారం నిర్వహించారు. రాయిగూడెం, అప్పల నరసింహాపురం, కట్టుకాసారం, కొంగర, బుద్ధారం, మం గాపురం తండాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, వైఎస్సార్‌సీపీ నేతలు బండారి వెంకటరమణ, మాది రెడ్డి భగవంత్‌రెడ్డి, జిల్లేపల్లి సైదులు, సంపెట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.