మాకూ ‘ప్రజెంటేషన్’కు అవకాశమివ్వాలి
♦ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్
♦ సీఎం అబద్ధాలపై ప్రజలకు ప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలోని తప్పులను ప్రజలకు చెప్పడానికి శాసనసభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి తమకు కూడా అవకాశం కల్పించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. అధికారపక్షం సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకే హాజరుకాలేదని చెప్పారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్ చేసి, అంచనాలను భారీగా పెంచుకుని ప్రజాధనాన్ని దోచుకోవడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనికి శాసనసభను రక్షణకవచంగా వాడుకోవడానికి కుట్రతోనే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారని ఆరోపించారు.
ప్రాణహిత, పాలమూరు, దుమ్ముగూడెం, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, పలు ఇతర ఎత్తిపోతల పథకాల్లోనూ సీఎం కేసీఆర్ చాలా అబద్ధాలు చెప్పారన్నారు. ఈ విషయాన్ని ఎత్తిచూపడానికి తమకూ అవకాశం ఇవ్వాలని స్పీకరును వ్యక్తిగతంగా కలవడంతోపాటు, లేఖల ద్వారా కూడా రెండుసార్లు విజ్ఞప్తి చేసినట్టు భట్టి వివరించారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడటానికి అవకాశం లేకపోతే సభకు హాజరుకావడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకుం డానే అధికారపక్షం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిం చడానికి, అందులో జరిగే అవినీతిపై న్యాయపోరాటం చేయడానికి ఇప్పుడు అవకాశం ఉందని వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట సీఎం కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకునే కుట్రలో భాగస్వామి కాలేక, వాస్తవాలను ప్రజలకు చెప్పే అవకాశాన్ని ఇవ్వకపోవడం వల్లనే శాసనసభకు కాంగ్రెస్‌పార్టీ హాజరుకాలేదన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన అబద్ధాలను ప్రజలకు వివరించేందుకు తాము కూడా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇస్తామని భట్టి ప్రకటించారు.
అన్ని మండలాల్లోనూ కరువు...
రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కరువు తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో అన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో శనివారం జరిగిన పీసీసీ కిసాన్‌సెల్ సమావేశంలో పలు తీర్మానాలను చేసినట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో తాగునీరుకు తీవ్ర ఇబ్బంది ఉందన్నారు. పశుగ్రాసం దొరకడంలేదని, మూగజీవాలు కూడా తాగునీటికి అల్లాడుతున్నాయని పేర్కొన్నారు, పంటల్లేక రైతులు, పనుల్లేక వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన కరువు నుంచి కాపాడే చర్యలు చేపట్టాలని భట్టి కోరారు.