వ్యక్తి దారుణహత్య
భార్య, కుమారుడే నిందితులు..
తాగి విసిగిస్తున్నాడని కడతేర్చారు
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం
పోలీసుల విచారణతో బయటపడ్డ వాస్తవాలు
అర్ధరాత్రి పూట నడిరోడ్డుపై శవం. ఆ మార్గంలో వెళ్లేవారు కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించగా తలపై బలమైన గాయమైన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే రోడ్డు ప్రమాదం జరిగినట్లు అనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని, ఆ ఇంటికెళ్లారు. భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగచూశాయి. ప్రతి రోజూ తాగి ఇంటికొచ్చి చిత్రహింసలకు గురి చేస్తుండటంతో తామే కడతేర్చామని వారు ఒప్పుకున్నారు.
అనంతపురం సెంట్రల్ : అనంతపురం మండలం కురుగుంట పంచాయతీలోని మల్లయ్య కొట్టాలకు చెందిన సుబ్బయ్య (48) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. సుబ్బయ్య కుటుంబం తోలుబొమ్మలాటలతో జీవనం సాగించేది. ఇటీవల కాలంలో సుబ్బయ్య తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ విపరీతంగా మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో పాటు వీధిలోని వారితో కూడా గొడవకు దిగేవాడు. అడ్డొచ్చిన భార్య సునందమ్మ, కుమారుడు నరేష్‌లపైనా చేయి చేసుకునేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో తాగి గొడవపడ్డాడు. ఇతని చేష్టలతో విసిగిపోయిన భార్య సునందమ్మ, కుమారుడు సరేష్‌లు కట్టెతో తలపై బలంగా కొట్టడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని సమీపంలోని అనంతపురం – కళ్యాణదుర్గం రహదారిపై పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. రహదారిపై మృతదేహం పడిందన్న సమాచారం అందుకున్న రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ జగదీష్‌లు అర్ధరాత్రే ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించారు. తలపై తప్ప మృతదేహంపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చింది. మృతుని వివరాలు కొనుగొన్న పోలీసులు నేరుగా వారి ఇంటికి వెళ్లారు. ఇంట్లో రక్తపు మరకలు ఆరకపోవడం, హత్యకు ఉపయోగించిన కట్టె లభ్యం కావడంతో భార్య, కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. హతుడి అన్న రామదాసు ఫిర్యాదు మేరకు భార్య సునందమ్మ, కుమారుడు సురేష్‌లపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగదీష్ వివరించారు.