మోదీకి లేఖరాసి వ్యాపారి ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం రూరల్ :
’నరేంద్ర మోదీ గారూ.. మీరు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఎంతమందికి ఉపయోగపడిందో తెలియదు కాని ఒక సామాన్యుడి ప్రాణం తీసింది. ఎందుకంటే నేను అప్పుల్లో ఉన్నాను. మీ నిర్ణయం పుణ్యమా అని ఒక్క రూపాయి కూడా దొరకక, చీటీలు కట్టలేకపోయాను. అప్పు ఇచ్చేవారు లేక ఎవరికీ సమాధానం చెప్పలేక చనిపోతున్నాను’ ఓ చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ. పెద్ద నోట్ల మార్పిడి ఎంత ప్రభావం చూపిందన్నది వ్యాపారి మనోవేదన కళ్లకు కడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రుకు చెందిన పోలిశెట్టి నరసింహమూర్తి (నాని) స్థానికంగా తాపీ పని చేసుకుంటూ, తన వద్ద ఉన్న డబ్బులను వడ్డీలకు తిప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పెద్ద నోట్ల రద్దుతో రావాల్సిన డబ్బులు ఆగిపోవడం, వేసిన చీటీలకు జనం నుంచి డబ్బులు వసూలు కాకపోవడం, తాను ఇవ్వవలసిన వారికి డబ్బులు ఇవ్వలేకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. బుధవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నరసింహమూర్తి శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. హన్మకొండ ఎందుకు వెళ్లాడో కుటుంబ సభ్యులకు సమాచారం లేదు. నోట్ల రద్దు వల్ల తాను ఇబ్బందులు పడ్డానని, అప్పులు తీర్చగలిగినన్ని తీర్చానని, ఇంకా తీర్చలేకపోవడంతో వారికి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను అనాథ శవంగా కాకుండా తన ఇంటికి శవాన్ని పంపించాలని ఈ లేఖ రాస్తున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, మోదీ నిర్ణయం వల్ల జీవించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నాడు. ఇదిలావుండగా తాపీ పని చేసుకుంటూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న నరసింహమూర్తి హన్మకొండ ప్రాంతంలో ఎవరికో అప్పు ఇచ్చి ఉంటాడని, అవి వసూలు కోసం వెళ్లి తిరిగిరాక పోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం తెలంగాణ పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. గురువారం స్వగ్రామం కొప్పర్రులో నరసింహమూర్తి మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. లేఖలోని దస్తూరి నరసింహమూర్తిదేనని అతని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.