తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చి... | man fraud in sri kalahasthi | Sakshi
Sakshi News home page

తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చి...

Published Sun, Jun 5 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చి...

తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చి...

40 సవర్లు బంగారం, రూ.3 లక్షలు చోరీ
 
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేసుకుంటే వ్యాపారం బాగా జరుగుతుందని నమ్మబలికి తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చి 40 సవర్లు బంగారం, రూ.3 లక్షలు చోరీ చేసిన ఘటన శనివారం శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. డీఎస్పీ వెంకట కిశోర్ కథనం మేరకు... కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లాపురం జిల్లా గౌరీబిదనూరుకు చెందిన గోపాలకృష్ణ రైస్ మిల్లులు నడుపుతున్నారు. ఆయనకు రెండు నెలల కిందట విజయవాడకు చెందిన సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సత్యనారాయణ పలుమార్లు గోపాలకృష్ణ ఇంటికి వెళ్లాడు.
 
 గోపాలకృష్ణ రైస్‌మిల్లులో వ్యాపారం సక్రమంగా జరగకపోవటాన్ని ఆసరాగా తీసుకున్న సత్యనారాయణ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో బంగారు ఆభరణాలు ధరించి పూజలు చేసుకుంటే వ్యాపారం బాగా జరుగుతుందని నమ్మబలికాడు. గోపాలకృష్ణ చెల్లెలి కొడుకు మనోజ్‌కు శ్రీకాళహస్తి ఆలయంలో ఉద్యోగం ఇప్పించేందుకు రూ.3 లక్షలు తీసుకురావాలని సత్యనారాయణ చెప్పాడు. గోపాలకృష్ణ, అతని భార్య వసంత, తల్లి నారాయణమ్మ గోపాలకృష్ణ చెల్లెలి కొడుకు మనోజ్ (హిందూపురం వాసి), మనోజ్ స్నేహితుడు కొండలబాబు (భద్రాచలం వాసి) శుక్రవారం శ్రీకాళహస్తికి చేరుకున్నారు. నగిరివీధిలోని ఒక లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు.
 
 విజయవాడ నుంచి సత్యనారాయణ కూడా శుక్రవారం శ్రీకాళహస్తికి చేరుకున్నారు. వారికి శనివారం ఉదయం దర్శనం చేయించి లాడ్జీకి పంపించారు. స్వామి, అమ్మ వారి తీర్థం తాగేవరకు బంగారు ఆభరణాలు అలాగే శరీరంపై ఉంచుకోవాలని చెప్పి సత్యనారాయణ తీర్థంలో మత్తు కలిపి అందజేశారు. తీర్థం తాగిన వెంటనే గోపాలకృష్ణ, వసంత, నారాయణమ్మ, మనోజ్, కొండలబాబు మత్తులోకి జారుకున్నారు. ఇదే అదునుగా భావించిన సత్యనారాయణ 320 గ్రాముల బంగారు ఆభరణాలు, ఉద్యోగం కోసం మనోజ్ తీసుకువచ్చిన రూ.3 లక్షలు, అతని స్నేహితుడు కొండలబాబు బ్యాగులోని రూ.15 వేలు నగదు, సెల్‌ఫోన్‌లు తీసుకుని పరారయ్యాడు.
 
 వారు మధ్యాహ్నం వరకు అద్దె గదుల నుంచి బయుటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది కిటికీలో నుంచి పరిశీలించారు. చలనం లేకుండా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ చిన్నగోవింద్, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ అక్కడికి చేరుకుని మత్తులో ఉన్న ఐదుగురిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి మత్తు దిగడంతో వారు పోలీసులకు పరిస్థితిని వివరించారు. కేసు నమోదు చేసి సత్యనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement