
భార్య, పిల్లలను కడతేర్చిన కర్కోటకుడు
కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యను గొంతు బిగించి కిరాతకంగా చంపిన ఓ కర్కోటకుడు తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రి పాలయ్యాడు.
కనిగిరి: కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యను గొంతు బిగించి కిరాతకంగా చంపిన ఓ కర్కోటకుడు తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని చింతలపాలెం గ్రామంలో మంగళవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు...
చింతలపాలేనికి చెందిన తమ్మినేని శ్రీనివాసులరెడ్డి మొదటి భార్య సుబ్బులు 15 ఏళ్ల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి ఇద్దరు సంతానం నాగార్జున, ప్రవల్లిక ఉన్నారు. పదేళ్ల క్రితం బాపట్ల మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన అప్పిరెడ్డి రెండో కుమార్తె ఆదిలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు గణేష్(7), కుమార్తె భవాని(5) ఉన్నారు. భర్త, అత్త తరచూ గొడవ పడుతుండటంతో ఇద్దరు పిల్లలతో కలసి ఆదిలక్ష్మి మర్రిపుడిలోనే కూలి చేసుకుంటూ జీవించేది.
చెడు వ్యసనాలకు, తాగుడుకు బానిసైన శ్రీనివాసులరెడ్డి అప్పుడప్పుడు మర్రిపూడి వచ్చి వెళ్లేవాడు. ఈక్రమంలో తర చూ భార్య, భర్తలు కీచులాడుకొనేవారు. పది రోజుల క్రితం భార్య పిల్లలను తాను జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మబలికి చింతలపాలేనికి తీసుకొచ్చాడు. మంగళవారం వేకువజామున మిద్దెపై నిద్రిస్తున్న భార్య, పిల్లలను నైలాన్ తాడుతో గొంతు బిగించి చంపాడు. ఆ తర్వాత తాను కూడా నిద్ర మాత్రలు మింగాడు. తెల్లవారినా ఎవరూ కిందికి రాకపోవడంతో మొదటి భార్య కుమార్తె ప్రవల్లిక పైకి వెళ్లి చూసింది. అక్కడి పరిస్థితి చూసి భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులురెడ్డిని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. తాను పలువురికి బాకీ ఉన్నానని, వాటిని తీర్చాల్సిందిగా కోరుతూ ఘటనకు ముందు శ్రీనివాసరెడ్డి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తల్లిదండ్రులను బాకీ తీర్చాల్సిందిగాను, మొదటి భార్య పిల్లలిద్దర్నీ బాగా చదువుకోవాల్సిందిగా రాశాడు.