ముద్దిరెడ్డిపల్లి వాసి అనుమానాస్పద మృతి | man suspicious death in near nandikonda | Sakshi
Sakshi News home page

ముద్దిరెడ్డిపల్లి వాసి అనుమానాస్పద మృతి

Published Fri, Mar 3 2017 9:47 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

man suspicious death in near nandikonda

చిలమత్తూరు : కర్ణాటకలోని చిక్‌బళ్లాపురం సమీపంలోని నందికొండ దగ్గర అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మరసలపల్లి పంచాయతీ ఎస్‌.ముద్దిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులు (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... ఎస్‌.ముద్దిరెడ్డిపల్లికి చెందిన వెంకట్రామప్ప, వెంకటలక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీనివాసులుకు అదే గ్రామానికి చెందిన శంకరప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె అశ్వినితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలను ఇంటివద్దే వదిలి గత శుక్రవారం శివరాత్రి పండుగ రోజు నందికొండకు పూజల నిమిత్తం శ్రీనివాసులు, అశ్విని వెళ్లారు. అయితే శనివారం అశ్విని మాత్రమే గ్రామానికి తిరిగి వచ్చింది.

దీంతో శ్రీనివాసులు తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా.. బహిర్భూమి వెళ్తానని చెప్పి తిరిగి రాలేదని సమాధానం చెప్పింది. ఆరు రోజుల నుంచి బంధువులు, గ్రామస్తులు శ్రీనివాసులు కోసం గాలించారు. ఈ క్రమంలో నందికొండ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని పర్యాటకులు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు, బంధువులు ఆ ప్రాంతంలోనే  ఉండడంతో మృతదేహం శ్రీనివాసులుదేనని గుర్తించారు. నందిహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement