
మొయినాబాద్‌లో సైకిల్‌యాత్ర ప్రారంభిస్తున్న మంద కృష్ణమాదిగ
మొయినాబాద్ : ఎస్సీ వర్గీకరణకోసం మాదిగల ధర్మయుద్ధమే అంతిమ యుద్ధమని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించే మాదిగల ధర్మయుద్ధం మహాసభ విజయవంతం చేయడం కోసం ఎంఆర్‌పీఎస్ యువసేన ఆధ్వర్యంలో చేపడుతున్న సైకిల్ యాత్రను గురువారం మొయినాబాద్‌లో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కృష్ణమాదిగ మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణతో పాటు, ఇతర సమస్యలపై ఎంఆర్‌పీఎస్ సుదీర్ఘపోరాటం చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలని ఏన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని..ఇటీవలే ఢిల్లీలో 23 రోజుల పాటు మహాధర్నా చేపట్టామన్నారు. వర్గీకరణ బిల్లుకు మద్దతిచ్చేందుకు బీజేపీ, వామపక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్నాయన్నారు. అయితే, కొందరు స్వార్థపరులు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టి ఎస్సీ వర్గీకరణను సాధించుకునేందుకు మాదిగలంతా ఐక్యంగా ఉండాలన్నారు.
మాదిగల ధర్మయుద్ధం మహాసభను 30 లక్షల మందితో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు వనం నర్సింహమాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్‌రావు మాదిగ, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు ఆశన్నమాదిగ, జిల్లా ఇన్ చార్జి నాగార్జున, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్, మాదిగ యువసేన నాయకులు రాజయ్యమాదిగ, యువసేన రాష్ట్ర కన్వీనర్ కమలాకర్‌మాదిగ, మండల అధ్యక్షుడు సునీల్‌కుమార్ మాదిగ, నాయకులు సంజీవరావు, సురేష్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.