ఆశలు ఆవిరి
మామిడి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దిగుబడులు తగ్గుతున్నాయి. ధర కూడా ఆశాజనకంగా లేదు. దీంతో రైతులు డీలాపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 6,820 హెక్టర్లలో మామిడి సాగు జరిగింది. వాస్తవానికి ఆదిలో సాగుకు వాతావరణం అనుకూలించింది. పూత ఆశాజనకంగా రావడంతో తమ కష్టం ఫలిస్తుందని రైతులు సంబరపడ్డారు.
మామిడి రైతుల డీలా
తగ్గుతున్న దిగుబడులు
ధరదీ అదే దారి
మందుల పిచికారీనే కారణం!
తాడేపల్లిగూడెం :
మామిడి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దిగుబడులు తగ్గుతున్నాయి. ధర కూడా ఆశాజనకంగా లేదు. దీంతో రైతులు డీలాపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 6,820 హెక్టర్లలో మామిడి సాగు జరిగింది. వాస్తవానికి ఆదిలో సాగుకు వాతావరణం అనుకూలించింది. పూత ఆశాజనకంగా రావడంతో తమ కష్టం ఫలిస్తుందని రైతులు సంబరపడ్డారు. పూత నిలిచేందుకు రైతులు శాస్త్రవేత్తలు వారిస్తున్నా.. వినకుండా విచ్చలవిడిగా 12, 13 సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. ఈ ప్రభావం ప్రస్తుతం దిగుబడిపై పడినట్టు కనబడుతోంది. రెండు, మూడు వారాలుగా తొలి కోతలు ప్రారంభమయ్యాయి. తొలుత ఎకరానికి 8 టన్నుల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు భావించారు. అయితే ప్రస్తుతం 40శాతం పడిపోయే పరిస్థితి కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణ మార్పులతో నష్టం
జిల్లాలో ఈ ఏడాది బంగినపల్లి, తోతాపురి(కలెక్టర్), రసాలు, ఇతర దేశవాళీ రకాలను రైతులు సాగు చేశారు. ఆదిలో వాతావరణం బాగానే ఉన్నా.. ఆ తర్వాత పూత నిలవడం కోసం రైతులు పురుగుమందులు పిచికారీ చేయం దిగుబడులను తగ్గించింది. ఆ తర్వాత చోటుచేసుకున్న వాతావరణ మార్పులతో కాయ రాలడం ప్రారంభమైంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రిపూట పడిపోవడంతో భారీగా కాయలు రాలడం ప్రారంభమయ్యాయి. ఈ దశలో తొలి కోతలు ప్రారంభమయ్యాయి. తొలుత ఎంత తక్కువనుకున్నా ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడులు వస్తాయని రైతులు ఆశించారు. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
ధర డీలా
ప్రస్తుతం మార్కెట్‌లో మామిడి ధరలు పడిపోయాయి. ముక్కల కోసం వినియోగించే తోతాపురి రకం (కలెక్టర్) టన్ను ధర రూ.ఏడు వేల నుంచి రూ. పది వేల వరకు ఉంది. బంగినపల్లి రకం టన్ను రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంది. వాస్తవానికి టన్ను ధర రూ.35 వేల వరకు ఉండాల్సిన ప్రస్తుత తరుణంలో ఇలా నేలచూపు చూడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ద్వారకాతిరుమల, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, చింతలపూడి మండలాలతో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ప్రాంతం నుంచి ప్రస్తుతం మామిడి కాయలు ఇక్కడి మార్కెట్లకు వస్తున్నాయి. వీటిని ఒడిశా, కోల్‌కతా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
మింగిన మంగు
తెల్లపూత వచ్చిన సమయంలో మామిడిపై రసాయనాలు పిచికారీ చేయకూడదు. అలాంటిది నిండుగా వచ్చిన పూత అంతా నిలబడాలని రైతులు శాస్త్రవేత్తల మాటలను పెడచెవినపెట్టి 1213 మందును పూతపై పిచికారీ చేశారు. దీంతో మామిడి కాయలు తయారైన సమయంలో మామిడిని మంగు(కాయపై సపోటా రంగులో మచ్చ రావడం) మింగేసింది. ఈ ప్రభావంతో మామిడి దిగుబడులు తగ్గిపోతున్నాయి.
ఆర్.రాజ్యలక్ష్మి, శాస్త్రవేత్త, నూజివీడు మామిడి పరిశోధనాస్థానం