మెట్ట ప్రాంతంలో ముందే పూసిన మామిడి
వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది మామిడి తోటలు ముందుగానే పూతకు వచ్చాయి. నియోజకవర్గంలో దాదాపు 30 శాతం తోటలు పూత పూసినట్లు ఉద్యానాధికారులు తెలిపారు. అయితే పూతకొచ్చిన తోటలకు మంచు దెబ్బ తగిలే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మంచు దెబ్బకు భయపడుతున్న రైతులు
చింతలపూడి: వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది మామిడి తోటలు ముందుగానే పూతకు వచ్చాయి. నియోజకవర్గంలో దాదాపు 30 శాతం తోటలు పూత పూసినట్లు ఉద్యానాధికారులు తెలిపారు. అయితే పూతకొచ్చిన తోటలకు మంచు దెబ్బ తగిలే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు, మూడేళ్ళుగా ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రైతులు మామిడి పంటపై గంపెడాశతో ఉన్నారు. సంవత్సరం అంతా సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటూ వస్తుంటే మంచు కారణంగా పూత, పిందె మాడిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ద్వితీయ స్ధానం, జిల్లాలో ప్రధమ స్థానం ఆక్రమించి విదేశాలకు సైతం ఎగుమతి చేసిన మామిడి పంటకు మెట్ట ప్రాంతంలో గత దశాబ్దంన్నరగా గడ్డు కాలం ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దశాబ్దాల పాటు కన్న బిడ్డల్లా కాపాడుకుంటూ వస్తున్న మామిడి తోటలను రైతులు గత్యంతరం లేక నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి తోటలు క్రమక్రమంగా 10 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. మామిడి తోటల అభివృధ్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ప్రోత్సాహం అందించక పోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది.
సస్యరక్షణ చేయాలి పొడి వాతావరణం కారణంగానే
నెల రోజులుగా వాతావరణం పొడిగా ఉన్నందున గత 10 రోజులుగా తోటల్లో పూత కనపడుతూందని అధికారులు చెప్పారు. రైతులు ఇప్పట్నించీ సరైన సస్య రక్షణ చేపట్టాలని సూచించారు. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 50 గ్రాముల యూరియా ఒక లీటరు నీటిలో కలిపి చెట్లకు స్ప్రే చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు.
తేనే మంచు పురుగు నివారణ ఇలా...
ప్రస్తుతం మామిడి పూతపై తేనె మంచు పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. లేత పూ మొగ్గలు ప్రారంభంలో తేనె మంచు పురుగు ఆసిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్(కాన్ఫిడార్) ద్రావణం 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా ధయో మిటాక్జిమ్ 10 లీటర్ల నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసినట్లయితే పురుగు ఉధృతి తగ్గుతుంది.
కె సంతోష్, ఉద్యానాధికారి