కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల, పేదల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ పత్రికలకు విడుదలైంది. ఎన్నికల ముందు రైతులకు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ 25 శాతం రుణాలనే మాఫీ చేసి చేతులు దులుపుకున్నాడని లేఖలో వివర్శించారు.
విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు సింగిల్ విండో విధానం పేరుతో కోట్లాది రూపాయలు లంచంగా తీసుకుని ఉచిత విద్యుత్, భూమి, నీరు, రాయితీలు ఇస్తున్నారని మండిపడ్డారు. మిషన్ కాకతీయ, మిషన బగీరథ కార్యక్రమాలను కమిషన్ల కోసం కొనసాగిస్తున్నట్టు విమర్శించారు. నేటి వర్షాభావ పరిస్థితులు, కరువుకు పాలకవర్గాల దోపిడీ విధానాలే కారణమన్నారు. కరువు సమస్యపై, తాగునీరు, సాగునీరు, పశుగ్రాసం కోసం ప్రజలు ఎక్కడికక్కడ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.