♦ పీకల్లోతు కూరుకుపోయిన చిరుద్యోగి
♦ ఏడేళ్లుగా కలెక్టర్ చెంతన డ్రైవర్‌గా విధులు
♦ ఉన్నట్లుండి నంద్యాలలో కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు
సాక్షి ప్రతినిధి, కడప : అతనో చిరుద్యోగి. ఏడేళ్లపాటు జిల్లా కలెక్టర్ వద్ద డ్రైవర్‌గా విధులు నిర్వర్తించేవాడు. ఉన్నట్లుండి 12 రోజుల క్రితం తహశీల్దార్ కార్యాలయానికి బదిలీ అయ్యాడు. విధి నిర్వహణలో ఉత్తమ డ్రైవర్‌గా కూడా ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం విధి నిర్వహణలో ఉండగా తహశీల్దార్ కార్యాలయం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు అతన్ని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఎందుకెత్తుకెళ్లారో.. సమస్య ఏమిటో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. మాట మాత్రంగానైనా సమాచారం ఇవ్వకుండానే తీసుకెళ్లారు. ఏడేళ్లపాటు కలెక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన ఆ చిరుద్యోగి ఇపుడు పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయాడు. అప్పటి నుంచి చిత్రహింసలకు గురిచేసినట్లు సమాచారం.
ఆ తర్వాత అత్యంత నాటకీయ ఫక్కీలో అతన్ని కర్నూలు జిల్లా నంద్యాల సీఐ వెంకట రమణ.. గంజాయి కేసులో అరెస్టు చేసి బుధవారం నంద్యాల కోర్టులో హాజరు పెట్టి రిమాండుకు పంపారు. ఔట్‌సోర్సింగ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇమ్మానియేల్ ఏడేళ్లపాటు ఎలాంటి రిమార్కు లేకుండా విధులు నిర్వర్తించినట్లు సహచరుల ద్వారా తెలుస్తోంది. అయితే, అర్ధంతరంగా 12 రోజుల క్రితం ఎందుకు బదిలీ కావాల్సి వచ్చిందనేది సందేహాలకు తావిస్తోంది. ఆపై కడపలో ఉన్న ఇతన్ని నంద్యాలకు తీసుకెళ్లి పోలీసులు ఓ కట్టుకథ అల్లినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఉన్నట్లుండి ఆ డ్రైవర్‌పై గంజాయి కేసు నమోదైంది. కడపలో గుర్తు పడతారని భావించి నంద్యాలలో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు వారి శైలిలో ఓ కథ అల్లి అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారం అంతుచిక్కని స్థితిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై సహచర డ్రైవర్లంతా ఆశ్చర్యపోతున్నారు.