
మరియ ఆశీస్సులతోనే సెయింట్ హోదా
కడప కల్చరల్:
విశ్వమాత మదర్‌థెరిసా కరుణామయి మరియమాత ఆశీస్సులు పొందడంతోనే నేడు సెయింట్ హోదా పొందగలిగారని అమగంపల్లె విచారణ గురువులు ఫాదర్ ఎల్ పీటర్ ప్రభాకర్ పేర్కొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని కడప వేలాంగణి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో నవదిన ఉత్సవాలలో భాగంగా ఏడో రోజు నిర్వహించిన సభలో ఆయన వక్తగా పాల్గొన్నారు. మదర్‌థెరిసా మరియమాతను ఎక్కువగా ప్రార్థించేదని, అందుకే ఆమె పునీతురాలై ప్రపంచంలోని గొప్ప హోదా అందుకున్నారన్నారు.
నేడు మన జీవితాలకు దైవం ఆశీస్సులే కారణమని, కృతజ్ఞతగా మనం నిత్యం ఆ దైవానికి స్తుతులు చెల్లించవలసి ఉందన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యమాత స్వరూపాన్ని అలంకరించిన తేరుపై ఉంచి మెర్సిడేరియస్ ఫాదర్లు, సిస్టర్లు, యూత్ ఆధ్వర్యంలో పాత గుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. సెయింట్ మెరీస్ క్యాథడ్రల్ చర్చి విచారణ గురువులు ఫాదర్ సగిలి ప్రకాశ్ దివ్య బలిపూజ నిర్వహించి ప్రారంభోపన్యాసం చేశారు. ఆరోగ్యమాత చర్చి డైరెక్టర్ ఫాదర్ కన్నా జయన్న వారిని శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సహాయ గురువులు, ఫాదర్లు కె.లూర్దురాజు, డి.సుమన్, ఉపదేశి ప్రసాద్, ఆరోగ్యమాత సభ సిస్టర్లు, తిరునాల కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.