చూసిరాతలు
–‘పది’ పరీక్షల్లో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్
– సిబ్బందే ప్రోత్సహిస్తున్న వైనం
– ఒక్క కేంద్రంలోనూ చర్యలు తీసుకోని అధికారులు
– ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
- యాక్ట్–25 అభాసుపాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ కేంద్రంలో ఇన్విజిలేటర్ చొరవ తీసుకుని ఓ విద్యార్థిని రాసిన జవాబు పత్రాన్ని అదే గదిలో ఇతర విద్యార్థులకు అందజేశారు. చూసిరాతను ప్రోత్సహించారు. ఇన్విజిలేటరే కల్పించుకుని తన పేపరు ఇతర విద్యార్థులకు ఇవ్వడంతో సదరు విద్యార్థిని ప్రశ్నించే సాహసం చేయలేదు.
– మరో కేంద్రంలో ఉదయం ఎనిమిది గంటలకే మూడో అంతస్తుపై పుస్తకాలు పెడుతున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత అటెండర్, వాటర్‌బాయ్ తదితరులు ప్రశ్నపత్రాన్ని పరిశీలించి.. పైకి వెళ్లి జవాబులు తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి చిట్టీలు ఇస్తున్నారు.
పదో తరగతి పరీక్షలు ఏ రీతిన జరుగుతున్నాయో ఈ రెండు ఘటనలే నిదర్శనం. ఈ నెల 17 నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లూ ఉండకూడదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కోన శశిధర్ మరో అడుగు ముందుకేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా చీఫ్ సూపరింటెండెంట్లను నియోజకవర్గాలు మార్పు చేశారు. గతంలో ఏ స్కూల్‌లో అయితే హెచ్‌ఎంగా ఉండేవారో అదే స్కూల్‌లో చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించేవారు. ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇక ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి జిల్లా పరిశీలకులుగా ఇక్కడే మకాం వేశారు. రోజూ పదుల సంఖ్యలో కేంద్రాలు తనిఖీలు చేస్తున్నారు.
అయినా ప్రయోజనం ఉండడం లేదు. చాలా కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. ఈ విషయంలో కొందరు ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు చక్రం తిప్పుతున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను ప్రలోభపెట్టి తమ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పరీక్షల నిర్వహణ సిబ్బంది కూడా ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు మాత్రమే చిట్టీలు ఇవ్వడం, చూసిరాతలు ప్రోత్సహించడం, బిట్స్‌కు సమాధానాలు చెప్పడం వంటివి చేస్తున్నారు. మరోవైపు ఆయా కేంద్రాలకు ఎవరైనా తనిఖీకి వస్తే నిమిషాల్లోనే అందర్నీ అలర్ట్ చేస్తున్నారు. తనిఖీ అధికారులు బయటకు వెళ్లగానే మళ్లీ తమ పని కానిచ్చేస్తున్నారు.
విద్యార్థుల ఆందోళన
మరోవైపు కష్టపడి చదువుకుని పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాము ఏడాదంతా కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే, తమతో పాటు రాస్తున్న మరికొందరు విద్యార్థులకు చిట్టీలు ఇవ్వడం, చూసి రాయిస్తుండటంతో వారు మనస్తాపానికి గురవుతున్నారు. వారితో పాటు తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే అక్రమాలను ప్రోత్సహిస్తున్నారంటూ వాపోతున్నారు.
యాక్ట్ 25 అభాసుపాలు
యాక్ట్- 25 నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, ప్రోత్సహించినా ఈ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు. ఆర్నెల్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది. ఇంతటి కఠినమైన చట్టం అమలులో ఉన్నా కొందరు బరి తెగిస్తూ అక్రమాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక కొందరు అధికారుల అండ కూడా ఉందనే ప్రచారం సాగుతోంది.
కూడేరులో గణితం పేపర్ లీక్
కూడేరు : కూడేరు హైస్కూల్ పరీక్షా కేంద్రం నుంచి శుక్రవారం పదోతరగతి గణితం పేపర్–2 ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 11 గంటలకు ప్రశ్నపత్రం బయట హల్‌చల్ చేసింది. దాని ఆధారంగా జవాబు స్లిప్పులను పరీక్షా కేంద్రంలోని గదుల్లోకి వేసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. పరీక్షా కేంద్రంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రశ్నపత్రం బయటకు రావడం గమనార్హం. కొందరు సిబ్బంది సెల్‌ఫోన్లను లోపలికి తీసుకెళుతున్నారని, వాట్సాప్ ద్వారానో, ఇతరత్రా మార్గాల్లోనో బయటకు పంపివుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.