పదిలో మాస్ కాపీయింగ్
♦ పీఈటీలు, డ్రాయింగ్ టీచర్లతో బిట్ పేపర్ చెప్పిస్తున్న వైనం
♦ శ్రీకాకుళం పాఠశాలలో యథేచ్ఛగా కాపీయింగ్
♦ చర్యలు చేపట్టని విద్యాశాఖాధికారులు
‘పది’లో మాస్ కాపీయింగ్
జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు, ఇన్విజిలేటర్లే పలువురు పాత్రధారులు కావటంతో కష్టపడి చదివిన విద్యార్థులు విస్తుపోతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన
అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
మచిలీపట్నం : పదో తరగతి పరీక్షలలో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరుగుతుండటం విద్యార్థులకు శాపంగా మారింది. రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు అధికారులు, ఇన్విజిలేటర్ల వైఖరితో నిర్ఘాంతపోవాల్సి వస్తోంది. జిల్లాలోని పలు పాఠశాలల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా స్క్వాడ్ బృందాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలపాలవుతోంది. పరీ క్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా కొందరు ఉపాధ్యాయుల వైఖరి కారణంగా పది పరీక్షల నిర్వహణ అభాసుపాలవుతోంది. అయితే విద్యాశాఖాధికారులు మాత్రం చర్యలు తీసుకుంటామని చెబుతూ తప్పించుకుతిరుగుతున్నారు. విద్యార్థుల జంబ్లింగ్ విధానం లోపభూయిష్టంగా ఉండటం గమనార్హం.
అంగలూరు..., శ్రీకాకుళం..., చిన్నాపురం..
గుడివాడ పరిధిలోని అంగలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా ఉన్న ఓ పీఈటీ ఈ నెల 24న పరీక్ష హాలులో బిట్ పేపర్ చెబుతూ స్క్వాడ్ బృందానికి దొరికిపోయారు. ఈ వ్యవహారం మొత్తాన్ని స్క్వాడ్ బృందంలో సభ్యుడిగా ఉన్న డెప్యూటీ తహశీల్దార్ వీడియో తీసి విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. పీఈటీని ఇన్విజిలేటర్ బాధ్యతల నుంచి తొలగించారు. ఈ ఉపాధ్యాయుడ్ని సస్పెం డ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తుండటంతో తనదైన శైలిలో పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఘంటసాల మండలం శ్రీకాకుళం జెడ్పీ ఉన్నత పాఠశాలలో యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో శనివారం సిట్టింగ్ స్క్వాడ్ బృందాన్ని అక్కడకు పంపారు. బందరు మండలం చిన్నాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ డ్రాయింగ్ టీచర్ బిట్ పేపరు ప్రతి తరగతి గదికి వెళ్లి జవాబులు చెబుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎవరైనా విద్యార్థులు అదేమిటని ప్రశ్నిస్తే జవాబులు సక్రమంగా రాయలేని వారు బిట్ పేపరు అయినా పూర్తిచేస్తే పాస్ అవుతారు కదా అని ఉపాధ్యాయులు అనటం గమనార్హం. గుడ్లవల్లేరు మండలం కౌతవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై డీఈవో ఎ.సుబ్బారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా అంగలూరు పాఠశాలలో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్న పీఈటీని ఇన్విజిలేటర్ విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. శ్రీకాకుళం పాఠశాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్‌ను పెంచుతామన్నారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే ఇంటి వద్ద చదవకుండానే పిల్లలు పరీక్షకు హాజరయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా నిఘా పెంచుతామని చెప్పారు.