మాయాజాలం | material theft in sk university | Sakshi
Sakshi News home page

మాయాజాలం

Published Sat, Nov 12 2016 10:11 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

మాయాజాలం - Sakshi

మాయాజాలం

– గతంలోరూ.90 లక్షలు విలువచేసే పరికరాలు గల్లంతు
–కొన్ని విభాగాలలో   అమర్చకుండానే స్వాహ
- ఎస్కేయూలో రూ. లక్షలాది విలువ చేసే పరికరాల ఆచూకీ గల్లంతు
- సెంట్రల్‌ స్టోర్‌ ఏర్పాటుపై మీనమేషాలు
- పరికరాల రికవరీని పట్టించుకోని అధికారులు


ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విలువైన పరికరాలు మాయమవుతున్నాయి. ఎస్కేయూలో 30 విభాగాల్లో  విద్యార్థులు, అధ్యాపకుల సౌకర్యార్థం రూ.90 లక్షలు వెచ్చించి  పరికరాలు కొన్నారు.  కానీ వీటిని మొక్కుబడిగా అమర్చి  కనిపించకుండా మాయం చేశారు. కొన్ని విభాగాలలో అసలు వాటి ముఖం కూడా చూపించకుండానే స్వాహా చేసేశారనే విమర్శలున్నాయి.

ఎన్నాళ్లిలా ...?  :
ఇచ్చిన ఆర్డర్‌కు, వచ్చిన వస్తువులకు మధ్య వ్యత్యాసం ఉన్నా వాటిని గుర్తించే వ్యవస్థ వర్సిటీలో లేదని విశ్లేషకుల భావన. విభాగాల అవసరాలకు వాటిని ఉపయోగించి,  అవసరం లేనపుడు వాటిని భద్రపరిచడానికి సెంట్రల్‌ స్టోర్‌ ఏర్పాటు చేయాల్సి ఉన్నా, దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఎంతో విలువైన వస్తువులు గల్లంతు అవుతున్నాయి. సెంట్రల్‌ స్టోర్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నప్పటికీ అది కార్యరూపం మాత్రం దాల్చలేదు.  వర్సిటీ పరిధిలోని ప్రాజెక్టుల కోసం తెప్పించుకొన్న యంత్రాలు, వివిధ ఉపకరణాలు ప్రాజెక్ట్‌ కాలవ్యవధి ముగిసిన తర్వాత వాటిని యూనివర్సిటీకి అప్పగించాలి. అధికారుల జవాబుదారీతనం లోపంతో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రాజెక్ట్‌ నిర్వహించే  ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ అందుకు సంబంధించిన పుస్తకాలను యూనివర్సిటీ సెంట్రల్‌ లైబ్రరీకి రిపోర్ట్‌ చేయాలి. ఇవేవీ పట్టనట్టు దర్జాగా అత్యంత విలువైన పుస్తకాలను దారి మళ్లించేస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయల పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో రాని పరిస్థితి నెలకొంది. ఇలా పుస్తకాల నుంచి ఇన్వెర్టర్ల వరకు జరుపుతున్న  అక్రమాలకు అడ్డుకట్ట వేసే రీతిలో వర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.  ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేసి  నిగ్గుతేల్చాలని డిమాండ్‌  చేస్తున్నారు.  

అధిక ధరకు కొనుగోలు : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిధులను ఖర్చు చేయకపోతే మిగిలిపోతాయనే ఉద్ధేశ్యంతో గత  మూడేళ్ల  కిందట హడావుడిగా పరికరాలను కొనుగోలు చేశారు. రూ.5 లక్షలు విలువ చేసే పరికరాల సరఫరాకు  టెండర్ల ద్వారా పిలవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఏకంగా రూ.90 లక్షలు విలువచేసే పరికరాలను కేవలం కొటేషన్ల ద్వారా కట్టబెట్టారు. ఇందులోనూ బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి. అనుకూలమైన కంపెనీలతో కొటేషన్లను ఆహ్వానించి జరపాల్సిన తతంగాలన్నీ నడిపించేశారు.

ఇందులోను అస్మదీయులకే దక్కేలా చేశారు.  వీటిని పర్చేస్‌ కమిటీ పరిశీలించి మార్కెట్‌ ధర కంటే అధిక మెత్తానికి నిర్ధారించారు.  ఒక్కో ఇన్వెర్టర్‌ «(3.5 కేవీ), ఎక్సైడ్‌ కంపెనీకి చెందిన నాలుగు  బ్యాటరీలు  మొత్తం కలిపి ఒక యూనిట్‌గా పరిగణించారు.   ఒక్కో యూనిట్‌కు  రూ. 90 వేలుగా నిర్ణయించారు. వాస్తవానికి మార్కెట్‌ ధరల ప్రకారం ఒక్కో యూనిట్‌ రూ.60 వేలుగా ఉంది. రూ.30 వేలు  అధిక ధరకు కొనుగోలు చేశారు.

వాటిని వినియోగించకుండా సొంత అవసరాలకు వాటిని దారి మళ్లించారు. అన్ని విభాగాలకు ఒకే సారి కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని , ఒక్కో విభాగానికి రూ.2.2 లక్షలు పెట్టి విడిగా కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపి చేతులు దులుపుకొన్నారు. ఇలా మొత్తం 30 విభాగాల వారీగా కొటేషన్లను ఆహ్వానించారు. మరోవైపు సైన్స్‌ విభాగంలో ఎల్‌సీడీ టీవీలను ఒక సీనియర్‌ ప్రొఫెసర్‌ ఏకంగా తమ బంధువులకు ధారాదత్తం చేసి తన త్యాగాన్ని చాటుకొన్నారు. ఈ అక్రమాలపై కమిటీ వేసి దర్యాప్తు చేయాలనే డిమాండ్లు అధికమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement