
మగ్దూంనగర్‌లోని ఓ మాంసం దుకాణం, ఓ మాంసం షాపు ముందు కట్టేసిన మేకలు
మహ్మాత్మాగాంధీ జయంతినాడు కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో మాంసం దుకాణదారులు యాథావిధిగా నిర్వహించారు.
కుత్బుల్లాపూర్: జాతిపిత మహ్మాత్మాగాంధీ జయంతి నేడు మాంసం విక్రయించరాదని, ఎవరైనా తమ ఆదేశాలు బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ మాంసం దుకాణాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు అంటించారు. ఆ తర్వాత అటు వైపు దృష్టి పెట్టకపోవడంతో ఆదివారం (గాంధీ జయంతి) కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో కొందరు మాంసం దుకాణదారులు యథావిధిగా షాపుల ముందే మేకలను కట్టి బహిరంగంగానే మాంసాన్ని విక్రయించారు.
మరికొందరు షాపు షట్టర్లను సగం దించి.. గుట్టుచప్పుడుగా తమ దందా కొనసాగించారు. అలాగే, గాంధీ జయంతి నాడు మద్యం విక్రయాలపై నిషేధం ఉన్నా... మద్యం ఏరులైపారింది. వైన్ షాపులు ముందు మూత, వెనుక మద్యం గ్లాసుల మోత వినబడింది. జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, సూరారం, చింతల్ తదితర ప్రాంతాల్లో ఇదే దృశ్యం కనిపించింది.