కంట్లో నలక ఉందని వెళ్తే.. | Medical Malpractice leds patients death in jagithyala | Sakshi
Sakshi News home page

కంట్లో నలక ఉందని వెళ్తే..

Published Thu, Aug 11 2016 6:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

కంట్లో నలక ఉందని వెళ్తే..

కంట్లో నలక ఉందని వెళ్తే..

ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం సత్తన్నపల్లికి చెందిన దొమ్మాటి సునీత(28) కంట్లో నలక ఉందని మంగళవారం జగిత్యాల పాత బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ కంటి ఆసుపత్రికి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె మృతి చెందింది. దీంతో సునీత కుటుంబ సభ్యులకు రూ.5.50 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం.

జగిత్యాల మండలం అనంతారానికి చెందిన సమత గత శుక్రవారం ప్రసూతి కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి, మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి నిర్వాహకులు బాధిత కుటుంబానికి రూ.2.50లక్షలు చెల్లించినట్లు వివాదం నుంచి బయటపడ్డట్టుతెలిసింది.

జగిత్యాల మండలం గుల్లకోటకు చెందిన నరేశ్‌ ఎండ్లబండి పైనుంచి పడడంతో అతడిని పట్టణంలోని పార్క్‌ సందిలో గల ఓ ఆర్థోపెడిక్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు బంధువులు. అతడిని పరిశీలించకుండానే ఆపరేషన్‌ చేయాలని వైద్యులు తేల్చారు. అనస్థీషియా మోతాదుకు మించి ఇవ్వడంతో నరేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన విషయాన్ని కప్పిపెట్టి.. మరో ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నట్లు నటించారు. చివరకు చావు కబురు చల్లగా చెప్పి.. రూ.2లక్షలు చెల్లించి గొడవ జరగకుండా జాగ్రత్తపడ్డారు.

ఇవి.. మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటి ఘటనలు జగిత్యాల పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తరచూ వెలుగుచూస్తున్నాయి. ఎవరైనా అనారోగ్యంతో  ఆస్పత్రికి  వచ్చారంటే అంతే సంగతులు. అవసరం లేకున్నా ఆపరేషన్‌ చేయాలంటున్న వైద్యులు.. చివరకు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ప్రాణాలకు విలువే లేదు?
అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రికి వస్తుంటారు. వైద్యులు పరీక్షించి అవసరమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. పరిస్థితి విషమిస్తే అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రికి రెఫర్‌ చేస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది. కానీ..జగిత్యాలలో ఇలాంటి పరిస్థితులు కనిపించవు. అనారోగ్యంతో వచ్చిన వారిని పరీక్షించకుండానే ఆపరేషన్‌కు సిఫార్సు చేస్తున్నారు. ఇది ఒక్కరోఇద్దరో కాదు.. ప్రతి ఆసుపత్రి వైద్యుడూ ఇదే పంథాను ఎంచుకుంటున్నారు. వారి వైద్యం కాస్త వికటించి మరణిస్తే ప్రాణాలకు వెలకట్టి చేతులు దులుపుకుంటున్నారు.

కుటుంబాలు విచ్ఛిన్నం
వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిన గుల్లకోటకు చెందిన రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. అలాగే కంటి ఆస్పత్రిలో చని పోయిన సునీతకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అతడిని స్వదేశానికి పంపేందుకు అక్కడి స్నేహితులు చందాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వైద్యుల నిర్లక్ష్యానికి కుటుంబంలోని చిన్నారులు అనాథలవుతున్నారు.

తెలిసీ తెలియని వైద్యం
స్థానికంగా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్న వారికి వైద్యంపై అవగాహన లేదంటున్నారు స్థానికులు. ఆపరేషన్‌ చేసినప్పుడు అనస్థీషియా ఇస్తుంటారు. దీనికి ప్రత్యేకంగా ఓ వైద్యుడు ఉండాలి. దీనిని విస్మరిస్తున్న స్థానిక వైద్యులు మోతాదు తెలియకుండానే.. మత్తు ఇస్తుండడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలస్తున్నాయి. ఒక్కోసారి ఆసుపత్రి కంపౌండర్‌ సైతం మత్తు ఇన్‌జక్షన్‌ ఇస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

తనిఖీలు శూన్యం
గతంలో అపెండిసైటిస్‌ ఆపరేషన్లను ఇష్టానుసారంగా చేయడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రులపై వైద్యాధికారులు నిఘా పెట్టారు. తనిఖీలు చేపట్టేందుకు ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంది. ఇప్పటివరకు అధికారులు ఒక్క ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన దాఖలాలు లేవు. పట్టణంలో మొత్తంలో 71 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో 17 ఆసుపత్రులకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ లేదు. కొన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నా.. డాక్టర్లందరూ అందుబాటులో లేరు. రిజిస్ట్రేషన్‌ ఒకరిపేరిట ఉంటే.. వైద్యం చేసేది మరొకరు. ఇక మల్టీస్పెషాలిటీ, క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఐదు వరకు ఉన్నాయి. ఇలా పలు ఆస్పత్రుల్లో సైతం సరైన నైపుణ్యం లేనివారే స్పెషలిస్ట్‌లుగా చలామణి అవుతున్నట్లు ఆరోపణలున్నాయి.

కంట్లో నలక ఉందని వెళ్తే..
కంట్లో నలక ఉందని వెళ్తే ఓ మహిళ ప్రాణం తీశారు జగిత్యాలలోని ఓ కంటి ఆసుపత్రి వైద్యులు. మృతురాలి సోదరి కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం సత్తన్నపల్లికి చెందిన దొమ్మాటి సునీత(28) కంట్లో నలతగా ఉందని సోమవారం జగిత్యాల పాత బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ కంటి ఆసుపత్రికి వచ్చింది. వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండానే ఆపరేషన్‌ చేయాలన్నాడు. ఆ సమయంలో తన వెంట ఎవరూ లేకపోవడంతో తన అక్కను తీసుకుని మంగళవారం మళ్లీ ఆసుపత్రికి వచ్చింది. మత్తు డాక్టర్‌తో మత్తు ఇప్పించాల్సిందిపోయి కాంపౌడర్‌తో ఇప్పించారు. మోతాదు మించడంతో సునీత అక్కడికక్కడే చనిపోయింది. ఆమె చనిపోయిన విషయాన్ని కప్పిపెట్టిన సదరు వైద్యుడు కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధరించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సునీత చనిపోయిందని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటిపోతుండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఐఎంఏ సభ్యులు సునీత కుటుంబానికి పరిహారం ఇప్పించేలా ఒప్పించినట్లు సమాచారం. దీంతో సదరు వైద్యులు ఆమె ప్రాణానికి రూ.5.50 లక్షలు వెలకట్టి శవాన్ని అక్కడినుంచి పంపించినట్లు తెలిసింది.

అనాథలైన చిన్నారులు
సునీత భర్త శ్రీహరి ఆర్నెల్ల క్రితమే ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. ప్రస్తుతం సునీత చనిపోవడంతో వారి పిల్లలు వైష్ణవి, వేణు అనాథలయ్యారు. దుబాయ్‌ నుంచి శ్రీహరి వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో తోటి స్నేహితులే చందాలు వేసుకుని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement