మందుల గాలం
-
పీడీ కంపెనీల మందులే అధిక విక్రయం
-
లాభాలు చూస్తున్న కొందరు వైద్యులు, మందుల దుకాణదారులు
-
ఫారిన్ ట్రిప్పులు, నజరానాలతో ఆకట్టుకుంటున్న ఆయా కంపెనీలు
‘పది కొంటే మరో పది ఉచితం.. మా మందులు అధికంగా రోగులకు రాసి, ఎక్కువ వ్యాపారం చేస్తే ఫారిట్ ట్రిప్, నగదు బహుమతి..’ ప్రస్తుతం ఔషధ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరిది. ‘ఇదేదో బాగుందే.. రోగి జేబు గుల్లయితే మనికేంటి.. కానిచ్చేద్దాం’ అన్న రీతిలో కొందరు వైద్యులు, మందుల దుకాణదారులు ఉన్నారు.
– కంబాలచెరువు (రాజమహేంద్రవరం)
వీరి ఆర్జన దండిగా ఉండడంతో.. చివరకు రోగి జేబుకు చిల్లుపడుతోంది. ఒకవేళ ఆ మందులను బయట ఎక్కడైనా కొందామంటే అవి దొరకవు. వాటిని ఏ వైద్యుడు రాశారో, అతని ఆస్పత్రిలోని మందుల దుకాణంలో మాత్రమే లభిస్తాయి. జిల్లాలో ఈ రకమైన దందా ఎక్కువగా సాగుతోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు చిక్కకుండా వీరు వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. ఒకవేళ పట్టుబడితే వైద్య లైసెన్సు రద్దు చేయడమే కాక, జైలు శిక్ష కూడా తప్పదు. వ్యాధులను నయం చేసేందుకు ఇటీవల కాలంలో మందులు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌లో వచ్చాయి. ఆయా ఔషధ కంపెనీలు అదే స్థాయిలో పోటీపడుతూ, వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో వృద్ధి చేసుకుంటున్నాయి. లాభం అధికంగా ఉండడంతో వైద్యులతో పాటు మందుల దుకాణాల్లోను పీడీ మందులనే ఎక్కువగా రోగులకు అంటగడుతున్నారు. ప్రముఖ కంపెనీలు ఎలాంటి ఆఫర్లు ఇవ్వకపోవడంతో.. వ్యాపారులు పీడీ కంపెనీల మందులనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
పీడీ కంపెనీ అంటే..?
ప్రొపగండ ఫర్ డిస్ట్రిబ్యూషన్(పీడీ) అంటే.. నేరుగా కంపెనీ నుంచి హోల్‌సేల్ లైసెన్సుదారుడు తెచ్చుకుని, విక్రయించే మందులు. ఇవి జిల్లాలో సుమారు 50 కంపెనీలు వాటిని సరఫరా చేస్తున్నాయి. ఈ మందుల కంపెనీలు వైద్యులనే టార్గెట్‌గా పెట్టుకుని, ఏడాదికి లక్షల రూపాయల్లో కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నాయి. ఆ ఏడాదికి ఆ కంపెనీ చెప్పిన టార్గెట్‌ను ఆ వైద్యుడు పూర్తిచేస్తే, ఫారిన్ ట్రిప్‌లు, భారీ నజరానాలు ఇస్తున్నాయి. దీంతోపాటు పది బాక్సులు కొంటే, మరో పది ఉచితంగా ఇస్తున్నాయి. సగానికి సగం లాభం వస్తుండడంతో ఆ వైద్యులు.. రోగికి ఆ మందులనే అంటగడుతున్నారు. అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్టు మందులు రాసిచ్చేస్తున్నారు. కేవలం ఆ ఆస్పత్రిలోనే అవి దొరకుతాయి. రోగికి ఆ మందులు అవసరమైతే మళ్లీ అక్కడకే రాకతప్పదు.
ఔషధ నియంత్రణ శాఖ నిఘా!
దీనిపై కన్నేసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు.. ఫారిన్‌ట్రిప్‌లు, నజరానాల విధానంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో పలు ప్రాంతాల్లో కొందరు వైద్యులు ఇలా దొరికితే, వారి లైసెన్సు రద్దు చేశారు. అంతేకాక కొందరికి జైలుశిక్షలు కూడా పడ్డాయి. వీటిపై అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఔషధ కంపెనీల ప్రతినిధులతో పాటు వైద్యులూ రూటు మార్చుకున్నారు. నేరుగా నగదు తీసుకోవడం లేదా అందుకు సరిపడా మందులు స్వీకరిస్తున్నారు. మరో పద్ధతి కూడా ఇటీవల ప్రారంభించారు. ఆ పీడీ కంపెనీ పేరిట వైద్య శిబిరం నిర్వహించి, రోగులకు ల్యాబ్‌టెస్ట్‌లు, ఇతర వైద్యసేవల రూపంలో ఆ వైద్యుడికి లబ్ధి చేకూరుస్తున్నారు. కాగా ప్రైవేట్ ఆస్పత్రులు డీఎంహెచ్‌ఓ పరిధిలో ఉంటాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లను నిత్యం తనిఖీ చేయాలి. పీడీ మందుల విక్రయం జిల్లాలో అధికంగా సాగుతున్నా, వాటిని రోగులకు అంటగడుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దృష్టి సారిస్తాం
ఆస్పత్రులకు వచ్చే రోగులకు వ్యాధి నయం చేసే మందులు రాయడం వైద్యుడు పని. వాటిని సక్రమంగా రాయకుండా, ప్రజలను దోచుకోవడం తప్పు. పీడీ మందుల విషయం ఇప్పటివరకూ మా దృష్టికి రాలేదు. వెంటనే వాటిపై దృష్టి సారిస్తాం. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీ చేపడతాం. వైద్యులెవరైనా అలా చేస్తే చర్యలు చేపడతాం.
–చంద్రయ్య, డీఎంహెచ్‌ఓ, కాకినాడ
పీడీ మందుల నాణ్యత తనిఖీ
జిల్లాలో సుమారు 50 పీడీ కంపెనీల మందులు సరఫరా అవుతున్నాయి. మందు ఒకటే, కంపెనీయే వేరు. హోల్‌సేల్ విక్రయదారుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాం. శాంపిల్స్‌ను ల్యాబ్ రిపోర్టుకు పంపాం. కొన్ని స్టాండర్డ్స్‌కు అనుగుణంగానే ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. వాటి నాణ్యత, లైసెన్సు వరకు మాత్రమే మా పరిధి ఉంటుంది. ఆస్పత్రులు, డాక్టర్లపై మాకు అధికారం లేదు.
– పి.శ్రీరామమూర్తి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ, రాజమహేంద్రవరం