మందుల మాయాజాలం | medicine bagotam | Sakshi
Sakshi News home page

మందుల మాయాజాలం

Published Mon, Sep 19 2016 11:23 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

మందుల మాయాజాలం - Sakshi

మందుల మాయాజాలం

  • ప్రజల ప్రాణాలతో చెలగాటం
  • విచ్చల విడిగా శాంపిల్స్‌ విక్రయాలు 
  • మెడికల్‌ షాపుల్లో నకిలీ,  కాలం చెల్లిన మందులు 
  • గ్రామీణ ప్రజలకు అంటగడుతున్న వైనం..
  • జగిత్యాల అర్బన్‌ : ‘ధర్మపురి మండలం చిన్నాపూర్‌ గ్రామానికి చెందిన కోరెపు శంకర్‌కు జ్వరం రావడంతో పట్టణంలోని జంబిగద్దె ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. అయితే సదరు వైద్యుడు పరీక్షలు అన్ని నిర్వహించి మందులు రాసి ఇచ్చాడు. శంకర్‌ మెడికల్‌ షాపుకు వెళ్లగా కొన్ని మంచి మందులు ఇచ్చి, మిగతావి శాంపిల్స్‌ ఇచ్చి వెనుక ఉన్న ‘నాట్‌ఫర్‌సేల్‌’ లేబుల్‌ తీసేశాడు. అతను ఇంటికి వెళ్లి మందులు వేసుకోగా, విరేచనాలై అస్వస్థతకు గురయ్యాడు.’
    ‘జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన వెంకటేశ్వర్‌రావు కోర్టు సమీపంలోని ఓ మెడికల్‌ షాపులో మందులు కొనుగోలు చేశాడు.  ఇంటికి వెళ్లి చూసుకోగా అవి అప్పటికే కాలం చెల్లినవి అని గుర్తించాడు’ అమాయకులు, గ్రామీణ ప్రజలే లక్ష్యంగా జగిత్యాల పట్టణంలో మందుల షాపుల యజమానులు మాయాజాలం చేస్తున్నారు. నకిలీ, కాలంచెల్లిన మందులు అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. 
     కాసులకు కక్కుర్తి పడి గ్రామీణప్రాంతాలకు చెందిన విద్యార్థుల, ప్రజల అనవసరపు ఆపరేషన్లు చేసి అందినంత దోచుకున్న వైద్యులు అనైతిక చర్యలకు పాల్పడి జైలు పాలైన సంగతి తెలిసిందే. కొందరు వైద్యులు తమ వృత్తని వ్యాపారం చేస్తూ దోచుకున్నట్లుగానే మెడికల్‌ షాపుల యజమానులు ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ, మెడికల్‌ ఏజెన్సీలు ఇచ్చే శాంపిల్స్‌ అంటగడుతున్నారు.  
    ఆర్‌ఎంపీల వద్ద స్టాక్‌ 
    మెడికల్‌ శాంపిల్స్, కాలం చెల్లిన మందుల దందా ఎక్కువగా ఆర్‌ఎంపీలే చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. మెడికల్‌ ఏజెన్సీల రిప్రజెంటేటివ్‌లు తమ వద్దకు వచ్చే శాంపిల్స్‌ను ఆర్‌ఎంపీలకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఆర్‌ఎంపీలు ఈ మందులనే గ్రామీణులకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. బహిరంగంగానే ఈ దందా జరుగుతున్నా జిల్లా డ్రగ్‌ అధికారులు తమకేమీ తెలియనట్లు ఉంటున్నారు. ఫిర్యాదులు అందినపుడు, పత్రికల్లో కథనాలు వచ్చినపుడు మాత్రం మూకుమ్మడిగా ఒకరోజు తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ‘సాక్షి’లో కథనం రాగా పాతబస్టాండ్‌లోని ఓ ఆస్పత్రి, పలు మెడికల్‌షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఒక్కరిపైనా చర్య తీసుకోలేదు. గతంలో టవర్‌సర్కిల్‌ ప్రాంతంలో ఓ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ ఇంట్లో మందులు దొరికాయి. తర్వాత ఆ అంశం కూడా అటకెక్కింది.  
    లక్షల్లో వ్యాపారం 
    ప్రధాన పట్టణంగా గుర్తింపు పొందిన జగిత్యాలలో శాంపిల్స్‌ దందా, నకిలీ మందులు, కాలం చెల్లిన మందుల దందా ఎక్కువగా జరుగుతోంది. లాట్ల రూపంలో మెడికల్‌ శాంపిల్స్‌ తెప్పిస్తూ కంపెనీల ప్రచారం చేపిస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలను మచ్చిగ చేసుకుని వారి ద్వారా ప్రజలకు అంటగడుతున్నారు.  
     కానరాని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు 
    జిల్లా డ్రగ్‌ అధికారుల నియంత్రణ లేకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడంతో జగిత్యాల పట్టణంలో మెడికల్‌ షాపుల యజమానులు ఆడిందే ఆటగా మారింది. నకిలీ మందులు, శాంపిల్స్‌ విక్రయిస్తున్నా, కాలం చెల్లిన మందులను అమ్ముతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పొరపాటున ఎప్పుడైనా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు నకిలీ, కాలం చెల్లిన మందులు దొరికినా వారు ‘మామూలు’గానే తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జగిత్యాల పట్టణంలోని పలు మెడికల్‌షాపులో మందుల మాయాజాలం దందా విచ్చలవిడిగా సాగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement