పేదలపై జులుం తగదు
పేదలపై జులుం తగదు
Published Sat, Jun 24 2017 11:41 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
లక్షల్లో ఇళ్లు అమ్ముకున్న వారిపై చర్యలు శూన్యం
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
రాజమహేంద్రవరం అఖిలపక్ష నాయకులు ద్వజం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) : హౌసింగ్ అధికారులు అర్హులుగా గుర్తించి రూ.60,800 అప్పులు చేసి మరీ ప్రభుత్వానికి చెల్లిస్తే ఎండోమెంట్‌కాలనీలో ఫ్లాట్‌లను కేటాయించారని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు లక్షల్లో ఆ ఇళ్లను అమ్ముకోవడం వల్లే పేదవారిని అన్యాయంగా ఖాళీ చేయించారని రాజమహేంద్రవరం అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మజ్జి అప్పారావు అధ్యక్షతన అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ప్రకటించిన 181 మంది ఎందుకు అనర్హులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులు చెప్పాలి ఉండగా, అలా కాదని అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆజ్ఞతో ఏకపక్షంగా కొత్తవారికి కేటాయించడం దారుణమన్నారు. అధికారులు, పోలీసులు ఇల్లు ఖాళీచేయించే విధానం కూడా లబ్ధిదారులను భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. తలుపులు పగలుగొట్టి, బయటకు ఈడ్చడం వంటి చర్యలు దారుణమన్నారు. కొత్తగా ఇచ్చిన 181మంది లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులు ఉంటే తొలగించినా ఇబ్బంది లేదని అర్హులకు మాత్రం అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతామని, బాధితులకు న్యాయం జరగని పక్షంలో కార్యాచరణ ఉద్యమాన్ని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఎంగిలి మెతుకులు కోసం ఆశపడడం దారుణం : రౌతు
అధికారపార్టీ నాయకులు లక్షల్లో సొమ్ములు వసూలు చేసి అర్హులైన పేదవాడి ఎంగిలి మెతుకులు కోసం ఆశపడడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నగర కో ఆర్డినేటర్ రౌతుసూర్యప్రకాశరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపేదవాడికి గూడు ఉండాలన్న ఉద్ధేశ్యంతో దేవదాయశాఖ భూమిలో గృహాలను నిర్మించారన్నారు. లబ్ధిదారులను అధికారులు సర్వే చేసిన తరువాతే వారి వద్ద సొమ్ములు కట్టించుకుని ఇళ్లు కేటాయించారన్నారు. అప్పుడు అర్హులు ఇప్పుడు అనర్హులు ఎలా అవుతారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నిర్మించిన వాంబే గృహాలలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనర్హులు ఉన్నారని తన దృష్టికి వచ్చినా పేదవాడికి అన్యాయం జరగకూడదని భావించి ఎవరినీ తొలగించలేదని స్పష్టంచేశారు. లబ్ధిదారుల కోసం పోరాడుతున్న మజ్జి అప్పారావును పోలీసులు అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించారు.
క్రిమినల్ కేసులు పెట్టాలి : సీపీఎం నేత అరుణ్
లబ్ధిదారులను అర్హులుగా ప్రకటించిన అప్పటి కలెక్టర్ నుంచి కింద తహసీల్దార్, హౌసింగ్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆ తరువాత వీరిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత టి.అరుణ్ డిమాండ్ చేశారు. అప్పటి అధికారులు సర్వేలు నిర్వహించి అర్హులుగా ప్రకటించిన తరువాతే సొమ్ములు కడితేనే ఇళ్లు కేటాయించారన్నారు.
జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనమా? కందుల
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కాదని రాజ్యాంగ విరుద్ధమైన జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో పచ్చ చొక్కాలకు ఇళ్లను కేటాయించడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులుగా ప్రకటించిన 181మంది ఎందుకు అర్హులు కారో వివరంగా శ్వేతపత్రంను విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అప్పటి ఎమ్మెల్యే రౌతు ఎంతో కృషి చేసి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మించి ఇచ్చారన్నారు. సీపీఐ నగర అధ్యక్షుడు నల్లా రామారావు మాట్లాడుతూ 181 మంది లబ్ధిదారుల తొలగింపుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి కలిస్తే అందరితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పినా అది అమలుకు నోచుకోలేదన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్‌వీ శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు పోలీసులు, అధికారులతో బలవంతంగా ఖాళీచేయించడం దారుణమన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు వైరాల అప్పారావు మాట్లాడుతూ లబ్ధిదారులలో దళితులు అని చూడకుండా దారుణంగా తలుపులు పగలగొట్టి ఖాళీ చేయించడంపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని హెచ్చరించారు. తండ్రి ముఖ్యమంత్రి, కుమారుడు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రీ కొడుకులుకు ఇళ్లు ఉండకూడదా అని ఎద్దేవా చేశారు. నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన లబ్ధిదారుణి పెద్దిరెడ్డి రాజేశ్వరిదేవిని అనర్హురాలుగా ప్రకటించి ఖాళీ చేయించడం దారుణమన్నారు. ఉద్యమ నేత మజ్జి అప్పారావు మాట్లాడుతూ అధికారులు, పోలీసులు తీరు దారుణమని, 54 మందికి హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిందని, పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును సీడీల రూపంలో త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అఖిలపక్ష నాయకులు మార్తి నాగేశ్వరరావు, పోలిన వెంకటేశ్వరరావు, గోలి రవి, మార్గాని రామకృష్ణగౌడ్, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement