దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు
దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు
Published Sun, Jan 22 2017 12:11 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
– వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున
– రాష్ట్ర రాజధానిలో రాజ్యాంగం అపహాస్యం
తుని రూరల్ (తుని) : వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాజధానిలో కలిసి తమ బాధలు చెప్పుకున్న దళిత రైతులు వెళ్లిన ప్రాంతంలో పనుపు నీళ్లతో కడగడం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా తునిలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎంపీపీ పల్లేటి నీరజ, పార్టీ పట్టణ కన్వీనర్ రేలంగి రమణగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలాంటి చర్యల ఫలితంగా భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత ద్రోహిగా వ్యహరిస్తున్నారని విమర్శించారు. దళిత రైతుల నుంచి, దళితేతర రైతుల నుంచి భూములను భయపెట్టి చేజిక్కించుకొని పరిహారం ఇవ్వకపోవడంతో భరోసా ఇచ్చి మనోధైర్యం కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటించారన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకోడానికి దళితులతోపాటు బాధితులు వస్తే ఆ ప్రాంతాల్లో పసుపు నీళ్లతో కడగడం దళితులను అవమానించడమేనని అన్నారు. దళితులు పట్ల బాబుకు ప్రేమ అనేది ఉంటే ఇలా వ్యవహరించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని అన్నారు. దళితుల పట్ల వ్యతిరేక ఆలోచన ధోరణితో ఉండడం వల్లే సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. హాస్టళ్లను, వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలో రోగాలకు అందే చికిత్సలను కుదించడం వల్ల దళితులకు, గిరిజనలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తారని హెచ్చరించారు. కౌన్సిలర్లు చితకల రత్నకుమారి, కర్రి అమలావతి, కర్రి అమలావతి, సాపిరెడ్డి శేషమణి, పోకల లక్ష్మి, జిల్లా నాయకులు పల్లేటి అచ్చారావు, గారా శ్రీనివాసరావు, బోడపాటి శ్రీను, శివకోటి సింహాచలం, పెయ్యిల సూర్యారావు, మూర దేవదానం తదితరులు పాల్గొన్నారు.
Advertisement