విభజన చట్టంలో హామీల మేరకే..
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీల మేరకే రాష్ట్రంలో మెట్రోరైలు ప్రాజెక్టుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం 20 లక్షల జనాభా దాటితేనే మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టాలని.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్ట్యా మెట్రోకారిడార్ ను ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు.
విశాఖలో ఎన్ఏడీ జంక్షన్ నుంచి మధురవాడ మీదుగా కొమ్మాడ వరకూ 28.8 కి.మీ మేర మెట్రోరైలు నిర్మాణం చేపడుతుండగా, రెండో మార్గం గురుద్వార నుంచి పాతపోస్టాఫీసు వరకూ , మూడో మార్గం తాటిచెర్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకూ 6.91 కి.మీ మేర మెట్రోప్రాజెక్టు ఉంటుందన్నారు.కొమ్మాడ నుంచి మార్గానికి గాజువాక మార్గానికి అనుసంధానం చేయాలన్నది మరో ఆలోచనగా వెంకయ్య తెలిపారు.
ఇదిలా ఉండగా, విజయవాడ మెట్రో రైల్వే లైన్కు 6769 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో 26.03 కిలో మీటర్ల మేర మెట్రో కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్లాన్లను మెట్రో చైర్మన్ శ్రీధరన్.. చంద్రబాబుకు అందజేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఈ నివేదికలను చంద్రబాబుకు సమర్పించారు. విజయవాడ బస్టాండ్ నుంచి పెనుమలూరు, నిడమానూరు వరకు రెండు కారిడార్లు నిర్మించనున్నారు. విశాఖ మెట్రో కారిడార్ను 45.5 కిలో మీటర్ల మేర చేపట్టనున్నట్టు చంద్రబాబు చెప్పారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టనున్నారు. విభజనచట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ, విజయవాడకు డీఎంఆర్సీ నివేదికపై చంద్రబాబుతో చర్చించినట్టు వెంకయ్య నాయుడు చెప్పారు.