పా‘పాల’ భైరవులు | milk mixing in hindupur daily | Sakshi
Sakshi News home page

పా‘పాల’ భైరవులు

Published Tue, Mar 28 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

పా‘పాల’ భైరవులు

పా‘పాల’ భైరవులు

- హిందూపురం ప్రభుత్వ డెయిరీలో యథేచ్ఛగా పాల కల్తీ
- మిల్క్‌ పౌడర్‌ కలిపి సరఫరా
- ‘సాక్షి’కి అడ్డంగా దొరికిన సిబ్బంది


హిందూపురం రూరల్‌ : పసిపిల్లలు తాగే పాలనూ కల్తీ చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. అక్రమార్జనే ధ్యేయంగా చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడో ప్రైవేటు డెయిరీ ఇలాంటి తంతు నడుస్తోందంటే ‘మామూలే’ అనుకోవచ్చు. కానీ ప్రభుత్వ డెయిరీ ఉద్యోగులే ఇలాంటి పాపాలు చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన పాలలో మిల్క్‌ పౌడర్‌ కలిపి బయట ప్రాంతాలకు సరఫరా చేస్తూ హిందూపురం ప్రభుత్వ డెయిరీ సిబ్బంది మంగళవారం ‘సాక్షి’కి అడ్డంగా దొరికిపోయారు. ఈ డెయిరీకి మడకశిర, గుడిబండ, ఓడీచెరువు, నల్లచెరువు, కల్లుమర్రి-1,2, లేపాక్షి, రొద్దం, పాలకూరు బల్క్‌ కూలింగ్‌ సెంటర్ల నుంచి ప్రతిరోజూ దాదాపు 16 వేల లీటర్ల పాలు వస్తున్నాయి. ఇక్కడి సిబ్బంది రోజూ 500 లీటర్ల వరకు కల్తీ పాలను మిక్స్‌ చేస్తున్నారు.

సాధారణంగా గేదె పాలలో వెన్నశాతం 8.5 వరకు ఉంటుంది. ఈ పాల «లీటరు ధర రూ.35. అదే ఆవు పాలలో వెన్న శాతం 8లోపే ఉంటుంది. రూ.30కి మించి ధర లభించదు. రైతుల నుంచి నిబంధనలను అనుసరించి పాలను సేకరించే డెయిరీ సిబ్బంది.. ఇక్కడికొచ్చాక అక్రమాలకు తెరలేపుతున్నారు. డెయిరీకొచ్చిన పాలలో వెన్నశాతాన్ని పెంచి.. తద్వారా వచ్చే ‘అదనపు మొత్తాన్ని’ స్వాహా చేస్తున్నారు. ఇందుకోసం బెంగళూరు నుంచి మిల్క్‌పౌడర్‌ బస్తాలను తీసుకొస్తున్నారు. 25 కిలోలుండే ఒక్కో బస్తా ధర రూ.3,700. కిలో పౌడర్‌తో 25 లీటర్ల కల్తీ పాలను తయారు చేయొచ్చు. ఇలా రోజూ 500 లీటర్ల కల్తీ పాలను తయారు చేస్తూ.. డెయిరీకి వచ్చేవాటిలోకి కలిపేస్తున్నారు.  

ఆది నుంచి అక్రమాలే
హిందూపురం ప్రభుత్వ డెయిరీ అక్రమాలకు నిలయంగా మారింది. గతంలో పనిచేసిన డెయిరీ మేనేజర్‌ సునీల్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రమణ అక్రమాలకు ఒడిగట్టి సస్పెండ్ అయ్యారు. గత డిసెంబర్‌లో హిందూపురం నుంచి ఒంగోలుకు పాల ట్యాంకర్‌ పంపేవారు. ఒంగోలు డెయిరీలో పాల నాణ్యతను పరిశీలించగా యూరియాను కలిపినట్లు తేలింది. ఇందుకు మేనేజర్‌ సునీల్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రమణలను బాధ్యులుగా తేల్చి సస్పెన్షన్‌ వేటు వేశారు. అయినప్పటికీ ఇక్కడ అక్రమాలు ఆగలేదు. కొత్తగా వచ్చిన సిబ్బంది కూడా అక్రమమార్గంలోనే వెళుతున్నారు. అసలే నష్టాల బాటలో ఉన్న ప్రభుత్వ డెయిరీ ఇలాంటి చర్యల వల్ల మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందని పాడిరైతులు, రైతుసంఘాల నేతలు అంటున్నారు.

వెన్న శాతం తక్కువ రాకుండా ఉండడానికే.. - బాలయ్య, డెయిరీ మేనేజర్, హిందూపురం
పాలలో వెన్న శాతం తక్కువ రాకుండా ఉండడానికే పౌడర్‌ను కలుపుతున్నాం. రైతుల నుంచి సేకరించే పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటోంది. దాంతో ఈ పాలను బయట ఎవరూ కొనడం లేదు. అందువల్ల పౌడర్‌ను కలిపి వెన్న శాతం పెంచి పాలను విక్రయిస్తున్నాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement