విధి నిర్వహణలో గని కార్మికుడి మృతి
-
కేటీకే 5వ గనిలో ఘటన
-
గుండె సంబంధ వ్యాధితో చనిపోయినట్లు వైద్యుల వెల్లడి
కోల్‌బెల్ట్ : భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ గనిలో విధులకు హాజరైన కార్మికుడు గడ్డం రాయమల్లు(54) ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో పనిచేస్తున్న సర్పేస్ జనరల్ మజ్దూర్ కార్మికుడైన రాయమల్లు శనివారం మొదటి షిఫ్టునకు హాజరయ్యాడు. మధ్యాహ్నం టబ్ క్లీనింగ్ పనులు ముగించుకొని అవుట్ పడేందుకు వెళుతున్న క్రమంలో గని ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో తోటి కార్మికులు వెంటనే మంజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గుండెకు సంబంధించిన వ్యాధితో చనిపోయి ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. కార్మికుడు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న గని మేనేజర్ విజయప్రసాద్ మృతదేహన్ని సందర్శించారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు మొగుళ్లపల్లి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందినవాడని అధికారులు తెలిపారు. కార్మికుడు మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న పలువురు కార్మికులు, కార్మిక సంఘ నాయకులు మంజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలి వచ్చారు.