46 మండలాల్లో మినీ రైతు బజార్లు
Published Wed, Oct 5 2016 7:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
బుట్టాయగూడెం: జిల్లాలోని చిన్న సన్నకారు రైతుల సౌకర్యార్థం అన్ని మండలాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. బుధవారం మండలంలో మినీ రైతు బజార్ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం బుట్టాయగూడెంలో ఆయన పర్యటించారు. స్థానిక ఎంఆర్‌వో సంత మార్కెట్ వద్ద ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 46 మండలాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 20 మండలాల్లో స్థల పరిశీలన పూర్తికాగా 19 రైతు బజార్ల ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించామన్నారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో స్థలాల్లో పరిశీలించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి మొదటి దశలో ఇళ్ల నిర్మాణాలు, ఇతర సౌకర్యాల పనులు పూర్తి చేశామని తెలిపారు. రెండో దశ పనులను అక్టోబర్ నెలలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఇళ్ల స్థలాలు, భూమికి భూమి సంబంధించి అధికారులు పనులలో నిమగ్నమయ్యారన్నారు. రెండో దశలో 2,200 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. జిల్లాలో ప్రజాసాధికారిక సర్వే 96 శాతం పూర్తయ్యిందని చెప్పారు. మిగిలిన 4 శాతం సరైన సిగ్నల్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆలస్యమవుతుందన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ ఏజీ చిన్నికష్ణ, ఏవో బి.సుమలత పాల్గొన్నారు.
Advertisement