
నీకింత... నాకింత...నిబంధనలు మనకెంత?
గుంటూరు జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే బంధువుల గ్రావెల్ దందా
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో మైనింగ్ మాఫియా విజృంభిస్తోంది. అధికారపార్టీ ఎమ్మెల్యేల అండదండలతో సున్నపురాయి మొదలు ఇసుక, మట్టి(గ్రావెల్).. ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు. ఇందుకు నిబంధనలను తోసిరాజని అధికారులు కూడా సహకరిస్తున్నారు. అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.
గుంటూరు డీపీఓ నుంచి ఉత్తర్వులు..
మంగళగిరి సమీపంలో కాజ, గుంటూరును ఆనుకుని ఉండే సుద్దపల్లి, శేకూరు గ్రామాల్లోని 142.73 ఎకరాల ప్రభుత్వ భూముల్లో మట్టి(గ్రావెల్)ని తవ్వుకునేందుకు ఏకంగా గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) అనుమతులిచ్చేశారు. కలెక్టర్ ఉత్తర్వులననుసరించి ఈ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు డీపీఓ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. గుంటూరు జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే బంధువులు ఈ అనుమతులు పొందడం గమనించాల్సిన అంశం. డీపీఓ ఇచ్చిన అనుమతి పత్రాన్ని అడ్డుపెట్టుకుని తెలుగు తమ్ముళ్లు భారీఎత్తున గ్రావెల్ తవ్వి దోపిడీకి తెరతీశారు. క్యూబిక్ మీటర్ గ్రావెల్‌కు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.330 ధర ఉంది. ట్రాక్టరుకు(మూడు క్యూబిక్ మీటర్లు) రూ.వెయ్యి, లారీకి(ఆరు క్యూబిక్ మీటర్లు) రూ.2 వేల వరకు వసూలు చేస్తూ కోట్లల్లో జేబులు నింపుకుంటున్నారు.
క్వారీ లీజులకు నిబంధనలివీ...
సాధారణంగా మైనింగ్, క్వారీ లీజులు పొందేందుకు సంబంధించిన నిర్దిష్ట విధివిధానాలపై ప్రభుత్వం 2013లో జీవో నంబరు 2 జారీచేసింది. దీనిప్రకారం జిల్లా స్థాయి కమిటీ సమావేశమై అనుమతులకు సంబంధించి మైనింగ్ డెరైక్టర్‌కు సిఫారసు చేయాలి. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, మైనింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్, సంబంధిత ఆర్డీవో, కాలుష్య నియంత్రణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా ఫారెస్ట్ అధికారి, సంబంధిత తహశీల్దారులు సభ్యులుగా ఉండే ఈ స్క్రూటినీ కమిటీకి క్వారీ తవ్వకాలకు సంబంధించి సిఫారసు మాత్రమే చేసే అధికారముంది. క్వారీ అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వారికి నిరభ్యంతర పత్రమిచ్చేందుకు దానికి ఎలాంటి అధికారం లేదు. దరఖాస్తు చేసుకున్న భూముల్ని కమిటీ పరిశీలించి నివేదికను మాత్రమే మైనింగ్ డెరైక్టర్‌కు పంపాల్సి ఉంటుంది.
కానీ ఇక్కడేం చేశారంటే..
కాజ, సుద్దపల్లి, శేకూరు గ్రామాల్లో మొత్తం 142.73 ఎకరాల్లో గ్రావెల్‌ను వెలికితీసేందుకు అధికారపార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే బంధువులు దరఖాస్తు చేసుకున్నారు. కాజలో 95.27 ఎకరాల్లో, శేకూరులో 7.30 ఎకరాల్లో, సుద్దపల్లిలో 40.16 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతులు కోరారు. అయితే కమిటీ పరిశీలనలో లేకుండానే కలెక్టర్ నోటు ఉత్తర్వుల ప్రకారం వీరికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు డీపీఓ జూన్ 23న ఉత్తర్వులివ్వడం గమనార్హం. సర్వే నంబర్లుసహా ఏ గ్రామాల్లో తవ్వకాలకు అనుమతి ఇస్తున్నారో కూడా స్పష్టం చేయలేదు. ఒకవైపు సదరు మూడు గ్రామపంచాయతీలు తమ గ్రామాల్లో గ్రావెల్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఏకంగా తీర్మానాలు చేసినా పట్టించుకోలేదు. కాగా దరఖాస్తుదారులు దరఖాస్తు నంబరును పొందుపరచకపోగా.. దాన్ని ‘నిల్’ అని పేర్కొన్నారంటే అడ్డగోలు అనుమతుల మంజూరు ఏవిధంగా ఉందో విదితమవుతోంది. కమిటీలో పంచాయతీల తరఫున నివేదిక ఇవ్వాల్సిన డీపీఓనే ఏకంగా అనుమతి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఉన్నతాధికారులు సైతం తప్పుపడుతున్నారు. అనుమతులిచ్చిన భూముల్లో ఎంతమేరకు గ్రావెల్ ఉందో.. మైనింగ్ ఏడీ నివేదికివ్వాలి. భూములకు సంబంధించిన సమాచారాన్ని తహశీల్దారు కలెక్టర్‌కు నివేదించాలి. ఇవేవీ లేకుండానే డీపీఓ అనుమతులివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ సదరు డీపీఓపై ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టిస్తూ అనుమతులిచ్చారనే ఆరోపణలున్నాయి.