
‘పరిటాల’ దర్పం
- దళిత ఉద్యోగికి వేధింపులు
- విధులకు అనుమతి నిరాకరణ
- 13 నెలలుగా వేతనం బంద్
- హైకోర్టు ఉత్తర్వులూ బేఖాతర్
అనంతపురం టౌన్ : మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ‘అధికార’ అరాచకం పెరిగిపోతోంది. అన్ని శాఖల్లోని అధికారులు మంత్రి, ఆమె అనుచరుల కనుసన్నల్లో పని చేయాల్సిందే. ఇక్కడ విధులు నిర్వర్తించాలన్నా.. విధుల్లోంచి తొలగించాలన్నా మంత్రి ఆజ్ఞ తప్పనిసరి. చివరకు కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ ఓ దళిత ఉద్యోగిని మానసికంగా వేధిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి పంచాయతీలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్‌ఏ)గా చంద్రమోహన్ 2012 ఆగస్టు 1న నియమితులయ్యారు. 2014 మార్చిలో సామాజిక తనిఖీలు నిర్వహించి పనులు కల్పించడంలో అలసత్వం వహించారని విధుల్లోంచి తొలగించారు. బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో చంద్రమోహన్‌ను విధుల్లోంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డ్వామా పీడీ నాగభూషణం ఉత్తర్వులు జారీ చేశారు.
సంబంధిత వివరాలను పీడీ కార్యాలయానికి అందజేయాలని చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓకు సూచించారు. చంద్రమోహన్‌కు సంబంధించి ఐడీ నంబర్‌ను పునరుద్ధరించాలని హెచ్‌ఆర్ మేనేజర్‌కు ఆదేశించారు. దీంతో 2015 అక్టోబర్ 19న ఎఫ్‌ఏను విధుల్లోకి తీసుకున్నారు. ఎనిమిది నెలలు సజావుగా సాగినా ఆ తర్వాత మళ్లీ కథ మొదటికొచ్చింది. రాజకీయ ఒత్తిడితో అతడ్ని విధుల్లోంచి తొలగించారు. ఆ తర్వాత బాధితుడు ఎన్నిసార్లు కలెక్టర్, డ్వామా అధికారులను ఆశ్రయించినా అదే పరిస్థితి. చివరకు తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఏకంగా గ్రీవెన్స్‌లో 2016 డిసెంబర్ 15న ఫిర్యాదు చేశారు. మళ్లీ కోర్టును ఆశ్రయించగా అదే నెల 31న సీకే పల్లి ఎంపీడీఓ తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే పనులు మాత్రం ఈయనతో చేయించడం లేదు. మంత్రి పరిటాల సునీత అండతో మరో వ్యక్తి అనధికారికంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
సాధారణంగా ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి జీతాలు రావాలంటే ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ చంద్రమోహన్ విషయంలో ఇప్పటికీ పేరు ఎక్కించని పరిస్థితి. ఉద్యోగి ఐడీ నంబర్‌ను పునరుద్ధరించాల్సిన హెచ్‌ఆర్ విభాగం అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే సుమారు 13 నెలల జీతం రావాల్సి ఉంది. ఈ విషయంపై అధికారులకు అర్జీలు ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రస్తుతం ఈ కుటుంబం పూటగడవడానికి సైతం ఇబ్బందులు పడుతోంది. అప్పులు చేసి బతుకీడుస్తున్నారు. ఈ విషయమై చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ రామాంజనేయులును ‘సాక్షి’ వివరణ కోరగా చంద్రమోహన్ విషయంలో రాజకీయ ఒత్తిడి ఉందని అంగీకరించారు. అసలేం జరిగిందని అడుగగా ‘మీటింగ్‌లో ఉన్నాను.. మళ్లీ కాల్ చేస్తానని’ చెప్పారు.
కోర్టు ఆదేశాలను అమలు చేశాం : నాగభూషణం, డ్వామా పీడీ
విధి నిర్వహణలో అలసత్వం కారణంగా మొదల్లో తొలగించాం. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు చంద్రమోహన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గానే ఉన్నాడు. జీతాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి వివరాలు రాగానే చెల్లిస్తాం. స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగానే విధులకు వెళ్లలేకపోతున్నాడు. అతడి స్థానంలో అనధికారికంగా ఎవరూ పని చేయడం లేదు.