ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి
-
ఆకస్మిక తనిఖీ
-
భోరజ్–సిర్సన్నలో మొక్కలను పరిశీలన..
-
నిర్లక్ష్యం వీడాలని అధికారులకు క్లాస్
జైనథ్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం అధికారులను హడలెత్తించారు. ఆయన ఆకస్మికంగా మండలంలోని భోరజ్–సిర్సన్న పీఆర్ రోడ్డు వెంట ఇటీవల హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. రోడ్డు వెంట నడుస్తూ.. మొక్కల పరిస్థితిపై అధికారులను అడదిగారు. ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? ఇంకా ఎన్ని నాటాలి? అని పీఆర్ ఏఈ నారాయణ, ఈజీఎస్ ఏపీవో ఆంజనేయులులను ప్రశ్నించారు. మొత్తం 1600 మొక్కల్లో 600 నాటామని, ఇంకా వెయ్యి త్వరలోనే నాటుతామని వారు మంత్రికి వివరించారు.
కొన్ని గుంతల్లో మొక్కలు నాటకుండా వదిలి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా 33 ఫీట్ల వెడల్పుతో మొక్కల నాటాలని చెబుతున్నా కూడా 20–24 ఫీట్లలో మొక్కలు నాటడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రోడ్డును విస్తరిస్తే మొక్కల పరిస్థితి ఏమిటని? ముందు చూపు, పక్కా ప్రణాళికలు లేకుండా మొక్కలు నాటడం వెనక అధికారుల ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. చిన్న మొక్కలు నాటొద్దని ఆదేశాలు జారీ చేసినా పెడచెవిన పెట్టారని అన్నారు.
నాటిన మెుక్కలకు ముళ్ల కంచె ఏర్పాటు చేయకపోవడంపై అధికారులను తీవ్రంగా మందలించారు. ‘ఇష్టం ఉంటే పనిచేయండి.. లేదంటే మానేయండి.. అంతేకాని హరితహారంపై నిర్లక్ష్నాన్ని సహించేది లేదు..’ అని స్పష్టం చేసారు. మంత్రి వెంట జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, నాయకులు ముడుపు దామోదర్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి, ఇజ్జగిరి అశోక్, రాజన్న, కోల పరమేశ్వర్, తదితరులు ఉన్నారు.