మంత్రి జోక్యం చేసుకోవాలి
Published Tue, Aug 2 2016 9:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
నాన్ టీచింగ్ ఉద్యోగుల రాష్ట్ర నాయకుడు కుమార్‌రెడ్డి
9వ రోజుకు చేరిన టైం స్కేల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
గుంటూరు వెస్ట్ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న టైం స్కేల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ఎంఎల్ కుమార్‌రెడ్డి కోరారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని టైం స్కేల్ ఉద్యోగులు జీవో 119 ప్రకారం ఇంటి అద్దె, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సులు, 12 క్యాజ్‌వల్ లీవులు, రిటైర్‌మెంట్ సౌకర్యాలను అమలు చేయాలని యూనివర్సిటీ ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 9వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 10వ పీఆర్‌సీ సిఫార్సుల మేరకు టైం స్కేల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు వీడీఏతో కూడిన కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్నిSకోరారు.
నేడు మానవహారం, 4న చలో కలెక్టరేట్..
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆందోళలను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు కుమార్‌రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీన మానవహారం, 4న కలెక్టరేట్ వద్ద ధర్నా, 5న నోటికి నల్లగుడ్డలు కట్టుకోవడం, 6న మోకాళ్లపై నడవడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే, 7వ తేదీన ఆకలికేకలు, 8న భిక్షాటన, 9న కళ్లకు గంతలు, 10న రోడ్లు ఊడ్వడం, 11న వెనక్కి నడవడం తదితర కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యూనివర్సిటీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
Advertisement