వీసీని నిలదీస్తున్న ఉద్యోగులు
సీఈ పోస్టు ఇవ్వాల్సిందే..
Published Wed, Aug 3 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
వీసీని ఘోరావ్ చేసిన డిప్యూటీ రిజిస్ట్రార్ శాంతిశ్రీ
ఆమెకు మద్దతు పలికిన ఉద్యోగులు
ఏఎన్‌యూ: యూనివర్సిటీలో అధ్యాపకేతర సిబ్బంది బదిలీలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముందుగా హామీ ఇచ్చిన ప్రకారం డీఆర్( డిప్యూటీ రిజిస్ట్రార్ )ఎం శాంతిశ్రీకి అవకాశం కల్పించలేదని కొందరు ఉద్యోగులు బుధవారం వీసీ చాంబర్‌లో ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న నలుగురు డీఆర్‌లను అంతర్గత బదిలీలు చేస్తూ గత నెల 30వ తేదీన రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల్లో పరీక్షా భవన్‌లో సీఈ (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) గా శాంతిశ్రీని నియమించకుండా ఇంకొకరిని నియమించటంపై నిరసన తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో బదిలీలు జరిగే సమయంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఎం సాయిబాబాకు సీఈగా అవకాశం కల్పించి.. ఆయన పదవీ విరమణ వెంటనే తనకు అవకాశం కల్పిస్తానని అప్పటి వీసీ ఆచార్య వియ్యన్నారావు ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇటీవల అంతర్గత బదిలీల ఉత్తర్వుల్లో గత వీసీ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయటమేంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు సీఈగా అవకాశం కల్పించాల్సిందేనని, లేకపోతే ఆత్మహత్యకు కూడా వెనకాడనని స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించకపోతే కార్యాలయం నుంచి కదలనిచ్చేది లేదని వీసీని ఘెరావ్ చేశారు. తాను విశాఖపట్నం వెళ్లాల్సి ఉందని వీసీ కోరినా డీఆర్, ఉద్యోగులు శాంతించలేదు. అరగంటపాటు వీసీని కదలనివ్వలేదు. అనంతరం వీసీ కారు వద్దకు రావడంతో.. డీఆర్ శాంతిశ్రీ కారుకు అడ్డంగా పడుకున్నారు. పర్యటన ముగించుకుని తాను ఈ నెల తొమ్మిదో తేదీన యూనివర్సిటీకి వస్తానని, అప్పుడు మాట్లాడతానని వీసీ హామీ ఇవ్వడంతో ఆయనను వెళ్లనిచ్చారు. ఈ సందర్భంగా శాంతిశ్రీ విలేకర్లతో మాట్లాడుతూ సీఈ పదవి విషయంలో దళిత మహిళనైన తనకు అన్యాయం జరిగిందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఏసీఈకి ఇన్‌చార్జి సీఈ బాధ్యతలు..
సీఈగా నియమితులైన ఎం మత్తయ్య ఆరోగ్య కారణాల రీత్యా సెలవు పెట్టటంతో ప్రస్తుతం ఏసీఈ (అడిషినల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్)గా ఉన్న జీ కనకసుందరంకు ఇన్‌చార్జి సీఈ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కే జాన్‌పాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement