సోదరుడి వరసయ్యే వ్యక్తే ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ బాధితురాలు మనోవేదనతో పదో తరగతి పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది.
తల్లాడ (ఖమ్మం) : సోదరుడి వరసయ్యే వ్యక్తే ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ బాధితురాలు మనోవేదనతో పదో తరగతి పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిని.. అదే వీధిలోని సొంత పెదనాన్న కొడుకు, ఆటో డ్రైవర్ జుంజునూరి రాజేష్ తన తల్లిదండ్రులు ఊరికి వెళ్లినప్పుడు చెల్లెలిని ఇంట్లో పనులు చేయాలని పిలిచేవాడు. రెండు నెలల నుంచి లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. భయపడి ఆమె ఎవరికీ చెప్పకుండా మిన్నకుంది.
దీనిని ఆసరా చేసుకున్న రాజేష్ పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయితే రాజేష్‌ను అతడి తల్లిదండ్రులను వెనకేసుకొచ్చారు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలసి తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన రాజేష్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన ట్లు ఎస్సై ఆర్.భానుప్రకాష్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే ఐదు పరీక్షలు రాసిన విద్యార్థిని సాంఘిక శాస్త్రం మొదటి పేపర్ రాయకుండానే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.