
పోయిన ఏటీఎం మిషన్ దొరికింది..
హొళగుంద: కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం అర్థరాత్రి దొంగలు ఎత్తుకుపోయిన ఏటీఎం మిషన్ హొళగుంద మండలం హెబ్బటం గ్రామం సమీపంలో లభ్యమైంది. ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు అందులోని నగదును తీసుకుని మిషన్‌ను మాత్రం చెళ్లవంక వాగులో పడేసి వెళ్లారు. గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు క్లూస్‌టీం, టెక్నికల్ బృందం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఏటీఎంను అక్కడిదాకా ఆటోలో తరలించి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఆదోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల రోడ్డులో ఇండియన్‌బ్యాంక్ ఏటీఎం మిషన్ ను గుర్తు తెలియని వ్యక్తులు పెకిలించి, ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే. ఏటీఎంలో రూ.5.27 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. దీనిపై బ్యాంకు సిబ్బంది మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.