సా..గుతోంది!
♦ నత్తనడకన ‘మిషన్ కాకతీయ’ పనులు
♦ చెరువుల పూడికతీతలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం
♦ ఇప్పటికీ పూర్తికాని తొలివిడత మిషన్ కాకతీయ పనులు
♦ 583 చెరువుల్లో కేవలం 262 పనులు మాత్రమే పూర్తి
♦ తాజాగా రెండో దశ పనులు చేపట్టిన యంత్రాంగం
మిషన్ కాకతీయ కార్యక్రమం తొలివిడతలో ఇంకా 312 చెరువుల పునరుద్ధరణ పెండింగ్‌లో ఉంది. ఇందులో వంద చెరువుల వరకు పనులు చివరిదశలో ఉండగా.. మిగతా చెరువుల మరమ్మతు అయోమయంలో పడింది.
రెండో విడతలో 562 చెరువుల మరమ్మతుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఈ క్రమంలో టెండర్లు పిలిచిన యంత్రాంగం 546 చెరువులకు కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. తొలివిడత పనులు దక్కించుకున్న మెజారిటీ కాంట్రాక్టర్లు రెండో విడతలోనూ పనులు దక్కించుకున్నారు.
ఇది పరిగి మండలంలోని రూప్‌ఖాన్‌పేట్ చెరువు. ఇందులో ప్రస్తుతం ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. వీళ్లంతా చెరువులో పూడిక తీస్తున్నారు. అయితే గతేడాది ఇదే సమయంలో మిషన్ కాకతీయ కింద రూ.12లక్షలు వెచ్చించి పూడికతీత పనులు చేపట్టారు. అప్పట్లో కాంట్రాక్టరు పైపైనే పనులు చేసి మమ అనిపించారు. తాజాగా ఉపాధిహామీ పథకం కింద ఇప్పటివరకు కూలీలకు రూ.2లక్షలు కూలిడబ్బులు చెల్లించారు.
చెరువులను పునరుద్ధరించి అధిక విస్తీర్ణాన్ని సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’ జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతోంది. మొదటి విడత పనులే పెండింగ్‌లో ఉండగా.. రెండో విడతకు అనుమతులు వచ్చేశాయి. 2015 జనవరిలో మొదటి విడతలో భాగంగా 583 చెరువుల్లో మరమ్మతులు చేపట్టి నీటినిల్వలు పెంచాలని నిర్ణయించారు. ఇందుకుగాను రూ.163.71 కోట్లు విడుదల చేశారు. కానీ ఏడాదిన్నరగా కేవలం 262 చెరువుల్లోనే పూడికతీతలు పూర్తి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2,851 చెరువులున్నాయి. ఇందులో మిషన్ కాకతీయ కార్యక్రమంలో తొలివిడత కింద 583 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టెండర్లకు ఉపక్రమించిన నీటిపారుదల శాఖ యంత్రాంగం.. 574 చెరువులకు మాత్రమే టెండర్లు పిలిచింది. మిగతా తొమ్మిది చెరువులకు సంబంధించి అధికారులు చొరవ తీసుకోకపోవడంతో వాటి పరిస్థితి అయోమయంలో పడింది. టెండర్లు పిలిచి పనులు చేపట్టిన వాటిలో కేవలం 262 మాత్రమే తాత్కాలికంగా పూర్తిచేసి నీటిపారుదల ఇంజినీర్లు మమ అనిపించారు. పనులు ప్రారంభమై ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకు చెరువుల్లో పనులు ఎక్కడికక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. కొన్నిచోట్ల పనులు నిలిచిపోవడంతో.. వాటిని ఉపాధిహామీ పథకం కింద తిరిగి చేపడుతున్నారు. పరిగి మండలంలో జరిగిన పనే ఇందుకు తాజా ఉదాహరణ. ఇలా ఒకే పనిని రెండేసి సార్లు చేపట్టడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది.
312 చెరువుల్లో పడకేసిన పనులు
మిషన్ కాకతీయ కార్యక్రమం తొలివిడతలో ఇంకా 312 చెరువుల పునరుద్ధరణ పెండింగ్‌లో ఉంది. ఇందులో వంద చెరువుల వరకు పనులు చివరిదశలో ఉండగా.. మిగతా చెరువుల మరమ్మతు అయోమయంలో పడింది.
మరోవైపు మిషన్ కాకతీయ కింద రెండో విడత 562 చెరువులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఈ క్రమంలో టెండర్లకు పిలిచిన యంత్రాంగం 546 చెరువులకు కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. తొలివిడత పనులు దక్కించుకున్న మెజారిటీ కాంట్రాక్టర్లు రెండో విడతలోనూ పనులు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలివిడతలో సగం పనులతో మమ అనిపించిన కాంట్రాక్టర్లు.. రెండో విడతలోనైనా పూర్తిస్థాయిలో పనులు చేస్తారా అనేది ప్రశ్నార్థకమే.