సాక్షి, హైదరాబాద్: భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానించే ప్రక్రియను నీటి పారుదల శాఖ వేగిరం చేసింది. ఏడాదంతా చెరువులు నీటితో కళకళలాడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఎక్కడెక్కడ అనుసంధానం చేయవచ్చన్న దానిపై శాఖ తీవ్ర కసరత్తులు చేస్తోంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వల నుంచి వచ్చే నీరు, వర్షం నీరు, రీజనరేటెడ్ నీళ్ల ద్వారా చెరువులను నింపేలా వ్యూహం ఖరారు చేస్తోంది. మొత్తంగా 44 వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించి సాగునీటి వసతిని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తూ మండలాల వారీగా ఇరిగేషన్ మ్యాపులను సిద్ధం చేస్తోంది. ‘భారీ, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువుల అనుసంధానం’పై ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగానే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇస్రో ద్వారా చేయించిన గొలుసుకట్టు చెరువుల మ్యాపింగ్‌పై నీటి పారుదల శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణలోని చెరువులకు ఇచ్చిన 265 టీఎంసీల కేటాయింపులను సద్వినియోగం చేయాలని సూచించారు. ఈ సూచనలకు అనుగుణంగా నెల రోజులుగా కసరత్తు చేస్తున్న అధికారులు, రాష్ట్రంలో మొత్తం 3,488 క్లస్టర్లలో గొలుసుకట్టు చెరువులున్నా యని గుర్తించారు. దాదాపు 10 వేల చెరువులు గొలు సుకట్టుకు అనుగుణంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులున్నాయి. ఈ గొలుసుకట్టులో ఉన్న మొదటి చెరువును గుర్తించి, దాన్ని ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేసేలా ప్రస్తుతం మ్యాపింగ్ ప్రక్రియ చేస్తున్నారు. ప్రాజెక్టుల కింద ఏ కాల్వ నుంచి ఏయే చెరువులను నింపవచ్చన్నది ఖరారు చేస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపేలా వ్యూహం ఖరారు చేస్తున్నారు. మొత్తంగా 44,955 చెరువులను రాష్ట్రంలోని 58 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో నింపేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు.
త్వరలో సీఎం సమావేశం..
ఒక్కో మండల పరిధిలో గరిష్టంగా 46 చెరువులను అనుసంధానించే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న 23 వేల కిలోమీటర్ల కాల్వల నెట్‌వర్క్ నుంచి అన్ని చెరువులు నింపేలా ప్రస్తుతం కార్యాచరణ సిద్ధమవుతోంది. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటి పారుదల ఇంజనీర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి.
వడివడిగా చెరువుల అనుసంధానం..
Published Sun, Aug 26 2018 2:05 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment