త్వరలో మిషన్ కాకతీయ ఫలాలు
బాల్కొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలు త్వరలోనే రైతులకు అందుతాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యసాగర్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం నీటి మట్టం, ప్రాజెక్ట్ ఆయకట్టు వివరాలను తెలుసుకున్నారు. రెండేళ్లపాటు సరైన వర్షాలు కురియకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక తీయడం వల్ల వాటి నీటినిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందాలని ఆకాంక్షించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను ప్రజలు కాపాడుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్ నాయకుడు చింత వెంకటేశ్వర్లు ఉన్నారు.