రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా రెండు రోజులుగా...
ఎమ్మెల్యే పీఆర్కే
మాచర్ల : రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా రెండు రోజులుగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జల దీక్షకు లభిస్తున్న జనాధరణను చూసైనా టీడీపీ ప్రభుత్వం స్పందించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కర్నూలుకు వెళ్తూ మంగళవారం ఆయన ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో ఆరు జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించిన ప్రజలు ఉవ్వెత్తున తరలివచ్చి జగన్ దీక్షకు మద్దతు పలుకుతున్నారన్నారు.
కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, డిండిలతోపాటు వివిధ ప్రాజెక్టులు చేపడితే కరువుతో తాము ఎల్లకాలం అల్లాడాల్సిందేనని భావిస్తున్న ప్రజలు, రైతులు జగన్ జలదీక్ష జయప్రదం కావాలని, అక్రమ ప్రాజెక్టులు నిలిచిపోవాలని కోరుతూ వేలాది మంది తరలివ స్తున్నారని చెప్పారు. ఇలాంటి జనాదరణ కలిగిన జగన్‌ను రోజూ మంత్రులచేత తిట్టిస్తూ ఏదో విధంగా ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబు అసలు సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల నిలిపివేతకు చర్యలు తీసుకునే విధంగా అధికార పార్టీ వ్యవహరించకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహం చవిచూడక తప్పదని ఆయన హెచ్చరించారు.