
24 గంటల నిరాహార దీక్ష
♦ వరుసగా ఉన్న ఐదు మద్యం షాపులను తొలగించాలి
♦ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో గుడి, బడితోపాటు పేదలు నివసించే ప్రాంతంలో వరుసగా ఉన్న ఐదు మద్యం షాపులను తొలగించాలని కోరుతూ శనివారం ఉదయం నుంచి 24 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ మద్యం షాపులను ఎత్తివేయాలని పలు మార్లు ప్రభుత్వాధికారులకు విన్నవించడం, వినతి పత్రాలు సమర్పించడం, ధర్నాలు చేశామని తెలిపారు. అయినా స్పందించలేదని తెలిపారు. ప్రజల ఇబ్బందిని, ముఖ్యంగా మహిళలు పడుతున్న అవస్థలను గమనించామని పేర్కొన్నారు. మద్యం ప్రియుల వల్ల ఆ ప్రాంత మహిళలు, హైస్కూల్, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, యువతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కారణంగా ఆ ప్రాంతంలోని ఐదు మద్యం షాపులను ఎత్తివేయాలని బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా డిమాండ్ చేస్తున్నానన్నారు.
మద్యం షాపులు ఎత్తేసే వరకు పోరాటం సాగిస్తాం
వైఎస్సార్ కాంగ్రెస్సార్‌పార్టీ నాయకత్వంలో టీడీపీ మద్యం పాలసీకి వ్యతిరేకంగా రామేశ్వరం రోడ్డులోని ఐదు మద్యం షాపులను ఎత్తివేసేంత వరకు పోరాటం సాగిస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం జన నివాసాల మధ్య షాపులు ఉండరాదని, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తే తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితమైన సీఎం చంద్రబాబు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని ప్రకటించడం ఇదేనా అని విమర్శించారు. ఈ దీక్షతోనైనా ప్రభుత్వంలో మార్పు రావాలని ఆశీస్తున్నానన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్‌ఏ నారాయణరెడ్డి, కౌన్సిలర్ టప్పా గైబుసాహెబ్, పోసా భాస్కర్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి లక్కిరెడ్డి పవన్‌కుమార్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.