‘ప్రభుత్వానికి సిగ్గులేదు’
అనంతపురం: ఆశా వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ... వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిగ్గులేదని ఎమ్మెల్సీ గేయానంద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
'ఆశావర్కర్లకు ఇచ్చే కొద్దిపాటి గౌరవ వేతనం ఇచ్చేందుకు డబ్బులు లేవని చెబుతున్నారు. చంద్రబాబు అమరావతి శంకుస్థాపనకు రూ.400 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయంలో చంద్రబాబు ఛాంబర్ కోసం ఒక ఫ్లోర్‌లో మరమ్మత్తులకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ వాస్తు బాగా లేదంటూ మరో ఫ్లోర్‌లో ఛాంబర్ ఏర్పాటుకు రూ.15 కోట్లు ఖర్చు చేశారు' అని గేయానంద్ విమర్శించారు.
హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి నెలసరి రూ.2 లక్షలు అద్దె చెల్లించేందుకు మాత్రం డబ్బులు ఉంటాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు చేస్తున్న పనికి కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలన్నారు. ఏ భాషలో చెప్పినా ఈ ప్రభుత్వానికి అర్థం కావడంలేదని... పోరాట బాట ద్వారానే సమస్యలు తెలియజేసి సాధించుకోవాలని అన్నారు. ఇది ఒక్కసారితో కాదని, సాధించుకునే వరకు పోరాటం చేయాల్సిందేనని మహిళలకు గేయానంద్ పిలుపునిచ్చారు.