భూసేకరణ చట్టానికి సవరణ
వెల్లడించిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదముద్ర వేసింది. త్వరలో సవరణలతో ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీంతోపాటు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ వివరాలను స్వయంగా మీడియాకు వెల్లడించారు.
► 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ త్వరలో ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఆమోదం. గుజరాత్ ప్రభుత్వం చేసిన విధంగా చట్టంలో మార్పులు.
► నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తేదీ నుంచి ఆరోగ్యరక్ష పథకానికి ఆమోదం. పథకం కింద కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నెలకు రూ.100 ప్రీమియం చెల్లిస్తే ఏటా రూ.2 లక్షల బీమా సౌకర్యం. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు ఈ మొత్తాన్ని సేకరించే బాధ్యత. ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28 వరకూ నమోదు ప్రక్రియ. మార్చి ఒకటో తేదీ నుంచి అమలు.
► చుక్క భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం. ఇందుకనుగుణంగా ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చేందుకు వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న చుక్క భూములకు సంబంధించి గత 15 సంవత్సరాల డాక్యుమెంట్లను పరిశీలించి అనంతరం అర్హులైనవారికి వాటి క్రమబద్ధీకరణ.
► శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు అక్కడున్న 21వ శతాబ్దపు గురుకుల కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి ఎచ్చెర్లలో తరగతులు ప్రారంభించేందుకు బడ్జెట్‌లో రూ.6.6 కోట్ల కేటాయింపునకు ఆమోదం.
► బీసీ–డి గ్రూపు వరుస క్రమంలో 39లో ఉన్న అగ్ముదియన్, అగ్ముదియార్, అగ్ముది వెల్లలార్, అగ్ముది ముదలియార్ (తుళువ వెల్లలాస్‌తో కలిపి) కులస్థుల కులం పేరు చివర మొదలియార్ పదాన్ని చేర్చుతూ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 20కి సవరించేందుకు అనుమతి.
► కడప జిల్లాలో చేపట్టిన గండికోట రిజర్వాయర్ (జీఎన్‌ఎస్‌ఎస్ తొలి దశ) ముంపు బాధితులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.479.35 కోట్ల పరిహారం ఇచ్చేందుకు అంగీకారం.
► పోలవరం ప్రాజెక్టుకు అవరోధాలను తొలగించి నిధులను సమకూర్చి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
మీరందరూ అంత బిజీనా?
ఇదిలా ఉండగా.. చంద్రబాబు గతంలో ఎప్పుడూ లేని విధంగా మంత్రులపై చిందు లు తొక్కారు. పోలవరం స్పిల్ వే కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవానికి సగం మంతి మంత్రులు డుమ్మా కొట్టడంపై ఆయన ఆగ్రహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి జన్మభూమి కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రచారం చేయా లని ప్రభుత్వం భావించింది. అయితే సగం మంది మంత్రులు డుమ్మా కొట్టారు. దీంతో కేబినెట్ భేటీలో మంత్రులను టార్గెట్ చేశారు. హాజరు కావాలని తాను స్వయంగా సూచించినప్పటికీ రాకపోవడానికి గల కారణాలేమిటని, అంత బిజీగా ఉంటే చెప్పండంటూ గట్టి స్వరంతో నిలదీసినట్లు సమాచారం. కాగా, రాష్ట్ర ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగు వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక హోదా అరుంధతి నక్షత్రం లాంటిది
ప్రత్యేక హోదా అరుంధతి నక్షత్రం లాంటి దని, అది కనబడకపోయినా కనబడినట్లు ఒప్పుకోవాలని చంద్ర బాబు చెప్పారు. అందుకే తాను సబ్జెక్టు తెలిసిన వ్యక్తిగా, లోతైన మనిషిగా దానికి సమానంగా ప్యాకేజీ ఇస్తానంటే అందుకు ఒప్పుకు న్నానని తెలిపారు. వెలగపూడి సచివాల యానికి వచ్చాక అంతా పాజిటివ్‌గా కనిపిస్తోందని, ఏ పని చేపట్టినా టకటకా జరిగిపోతోందని సీఎం చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన నీరు, మట్టిని వాడడం వల్ల ఇది శక్తిపీఠంగా తయారైం దన్నారు.