కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అద్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడిన విషయాలు చూస్తే ఆమెలో తెలుగుదేశం స్వరమే ఎక్కువగా కనిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంతకాలం ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చేవారో వాటినే అధికంగా వల్లె వేసినట్లు అనిపిస్తుంది. ఆమె ఆధ్వర్యంలో బిజెపి ఏపీలో పుంజుకుంటుందా? అనేది ఇంకా సందేహంగానే కనిపిస్తుంది. ఆమె కూడా వచ్చే ఎన్నికలలో తనవరకు ఎలాగొలా లోక్ సభకు గెలవాలని భావిస్తే.. టీడీపీతో పొత్తు వైపు మొగ్గు చూపుతారేమోనన్న అనుమానం వస్తుంది.
దగ్గుబాటి పురంధేశ్వరి ద్వారా ఏపీలో బలమైన కమ్మ సామాజికవర్గం వారిని ఆకర్షించగలుగుతారన్న ఆశతో బీజేపీ అధిష్టానం పంపించి ఉండవచ్చు. కానీ ఆమె ఆ ఆశ ఎంతవరకు నెరవేర్చుతారన్నది ఇప్పుడే చెప్పలేం. పార్టీ అధినేత్రిగా సీటులో కూర్చున్న తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్పు కాదు. అవి అర్దవంతంగా ఉండాలి. హేతుబద్దంగా ఉండాలి. వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. అంతేకాక వైఎస్సార్‌సీపీతో పాటు బిజెపికి పోటీగా ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించి ఉండాలి. కాని ఆమె ఆ పని పెద్దగా చేసినట్లు అనిపించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆమె ఏ మేరకు ప్రజలను కూడగట్టుకోగలుగుతున్నది డౌటుగానే ఉంటుంది.
✍️ అనూహ్యపరిణామాల నడుమ.. రాజకీయాలలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రి పదవి పొందితే, బీజేపీలో కూడా జాతీయ స్థాయిలో పదవులు నిర్వహించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్(స్వర్గీయ) కుటుంబ సభ్యులు మూడు పార్టీలలో ప్రముఖంగా ఉండడం. ఎన్టీఆర్ మూడో అల్లుడు చంద్రబాబు నాయుడు టిడిపి అధినేతగా ఉండగా, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సీపీలో ఉండి.. క్యాబినెట్ హోదా కలిగిన అకాడమీ పదవిలో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన కుమార్తె పురంధేశ్వరి బిజేపీ అధ్యక్షురాలయ్యారు. ఎన్.టి.ఆర్. వారసత్వాన్ని బిజెపికి అనుకూలంగా మార్చడానికి ఆమెను నియమించి ఉండవచ్చన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
✍️ వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవలేకపోతే.. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పురందేశ్వరి నాయకత్వం ఉపకరించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్.టి.ఆర్. అభిమానులు చంద్రబాబు వైపు ఉండాలా? లేక పురందేశ్వరి వైపు ఉండాలా? అన్న మీమాంస ఏర్పడేలా ఈమె వ్యూహం ఉండాలి. ఎన్.టి.ఆర్.కుమారులు ఎవరూ ఈ స్థాయికి చేరుకోలేకపోయారు. వారంతా చంద్రబాబుకు సరెండర్ అయిపోయారు. పురంధేశ్వరి ఇప్పుడు చంద్రబాబుకు పోటీ నేతగా ఎదిగి తనకంటూ ఒక స్థాయి తెచ్చుకున్నారు. దానిని నిలబెట్టుకుంటారా? లేదా? అనేది తేలడానికి కొంతకాలం పడుతుంది. ఇది ఆమె నాయకత్వ పటిమకు ఒక పరీక్షే అవుతుంది.
✍️ ఇక.. జనసేన తో పొత్తు కొనసాగించడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించవలసి ఉంటుంది. పురందేశ్వరి గతంలో మాదిరి టిడిపి పట్ల అంత వ్యతిరేకతతో లేరని , అందువల్ల ఇప్పుడు కూడా ఆ పార్టీతో పొత్తుకు అవకాశం లేకపోలేదని అనేవారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన తొలి ప్రసంగంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపైన ఎక్కువ విమర్శలు ఎక్కుపెట్టారు. కానీ.. టీడీపీనీ కూడా విమర్శించగలిగి ఉంటే ఆమెపై ప్రజలలో గౌరవం పెరిగేది. ప్రస్తుతానికి టీడీపీ జోలికి వెళ్లరా? లేదంటే ఆమె కూడా టీడీపీతో పొత్తును ఆశించి సరెండర్ అవుతారా? అనేది తెలియడానికి కొంతకాలం పడుతుంది.
✍️ పురంధేశ్వరి చేసిన కొన్ని విమర్శలు టీడీపీకి, ఎల్లోమీడియాకు ఉపయోగపడేవిగా ఉన్నాయి తప్ప బీజేపీకి కాదనే చెప్పాలి. ఉదాహరణకు శాంతి భద్రతలతో పాటు అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలం అయిందని ఆమె అన్నారు. ఇందులో నిజం ఎక్కడ ఉంది? టీడీపీవాళ్లు చేసే ఆరోపణనే వల్లెవేశారు తప్ప ,జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డు చూస్తే అలాంటిదేమీ లేదని వెల్లడవుతుంది.
✍️ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించలేక చేతులెత్తేశారని ఆమె అంటున్నారు. హత్య ఘటన చంద్రబాబు టైమ్ లో జరిగిందన్న సంగతి ఆమె మర్చిపోయారా? హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారిస్తున్న సంగతి తెలియనంత అజ్ఞాని అని ఆమె అనుకోలేం. సీబీఐ ఇంతకాలంగా ఈ కేసును తేల్చలేకపోతే అది కేంద్ర ప్రభుత్వ అసమర్దత అవుతుందా? రాష్ట్రానికి సంబంధించింది అవుతుందా? ఈ లాజిక్‌ను ఆమె మిస్ అవడం ఆశ్చర్యమే!.
✍️ బాపట్లలో ఒక బాలుడి సజీవ దహన ఉదంతం గురించీ ఆమె మాట్లాడారు. ఆమె స్థాయికి ఇలాంటివి తగునా?. రెండు కుటుంబాల మధ్య తగాదాను రాజకీయంగా వాడుకోవచ్చా?. తెలుగుదేశం అనైతిక విమర్శలకు ,ఈమె ఆరోపణలకు తేడా ఏముంది? ఆ మాటకు వస్తే ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ ఒక యువతిని దారుణంగా హత్య చేసి, అర్ధరాత్రి శవ దహనం చేసిన ఘటన, తదుపరి రైతులపై వాహనం ఎక్కించిన దారుణం వంటివి దేశం అంతటా తీవ్ర కలకలం రేపాయి. రైతులపై వాహనం ఎక్కించిన కేసులో ఏకంగా బీజేపీ కేంద్ర మంత్రి కుమారుడినే అరెస్టు చేశారు కదా?. మరి యూపీలో బీజేపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు విఫలం అని ఆమె ఒప్పుకుంటారా? యూపీలోనే నడిరోడ్డుమీద పోలీసుల సమక్షంలో ఒక మాజీ ఎంపీని, ఆయన సోదరుడిని ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన ఘటన గురించి ఆమె ఏమి అంటారు? రౌడీషీటర్ల పేరుతో పలువురి ఇళ్లను బుల్ డోజర్ లతో కూల్చారే. అప్పుడు బిజెపి పాలన చాలా చక్కదనంగా ఉందని ఆమె చెబుతారా? ఏపిలో అలాంటివి ఏమైనా జరిగాయా? లేదే! ప్రశాంతతను చెడగొఇట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న టీడీపీ, జనసేనలతో ఆమె కూడా కలుస్తున్నారా? అనే సంశయం కలగకమానదు.
నాన్నకు ప్రేమతో.. మొట్టికాయలు బాబుకు వేయాల్సిందే!
✍️ నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయాన ఆమె సోదరి(భువనేశ్వరి) భర్త. అయినా ఆయన చేతిలో దగ్గుబాటి కుటుంబం ఎన్నిసార్లు అవమానాలకు గురైందో ఆమె మర్చిపోయారేమోనన్న అనుమానం వస్తుంది. దిశ యాప్ పనిచేయడం లేదట. మద్యం అమ్మకాలలో ఇరవై శాతమే తయారీదారులకు వెళుతోందట. మిగిలింది తాడేపల్లి ప్యాలెస్ కు వెళుతోందట. ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేయడానికి ఈమె అవసరం లేదు కదా?. టీడీపీలో చంద్రబాబు నుంచి చిన్న స్థాయి నాయకులు అదే పనిలో ఉన్నారే!. ఆమె కూడా ఆ స్థాయికి దిగజారదల్చారా?. బిల్లులు రాకా కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జరిగాయట!. కొద్ది కాలం క్రితం వరకు కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీపై వచ్చిన ఆరోపణ ఏమిటి? మంత్రులు నలభై శాతం కమిషన్ తీసుకుంటున్నారని, ఒక కాంట్రాక్టర్ ఏకంగా లేఖ పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఏపిలో అలా జరగకపోయినా, ఈనాడు వంటి తెలుగుదేశం మీడియా రాసే తప్పుడు కథనాలనే ఈమె వల్లె వేసినట్లు అనిపిస్తోంది.
✍️ విశాఖలో భూకబ్జా అనో,దసపల్లా భూముల గురించి ఆమె మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆమె అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అంతమాత్రాన ఆమె కబ్జాలకు పాల్పడిందని చెబుదామా?ప్రైవేటు భూములకు చుక్కల భూములని పేరు పెట్టి కొట్టేస్తున్నారని మరో దిక్కుమాలిన ఆరోపణ చేశారు. అంటే రైతులు ఎల్లకాలం తాము సాగు చేస్తున్న భూములపై హక్కు పొందరాదని బీజేపీ భావిస్తోందా?.. ఇళ్ల నిర్మాణం గురించి గత తొమ్మిదేళ్ల పాలనను ప్రస్తావించారు. చంద్రబాబు టైమ్ లో అసలు ఎన్ని కట్టారు? వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎన్ని నిర్మిస్తున్నారు? 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ను, ఏమీ ఇవ్వని చంద్రబాబును ఒక గాటన మాట్లాడడంలోని ఆంతర్యం ఏమిటి?.
✍️ ఏపీకి పరిశ్రమలురావడం లేదని, వెళ్లగొడుతున్నారని పచ్చి అబద్దాలను పురంధేశ్వరి కూడా చెప్పడం ద్వారా ఆమె తన గౌరవాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. రిలయన్స్ అదినేత ముకేష్ అంబాని వంటివారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెంత కూర్చుని పెట్టుబడులు పెడతామని చెప్పిన రాష్ట్రం ఏపీ కాకుండా మరొకటి ఉందా?. పోలవరం కట్టడం చేతకాకపోతే పక్కకు తప్పుకోండని పురంధేశ్వరి అంటున్నారు. ఆమెకు గుర్తుందో లేదో,అసలు ఇది జాతీయ ప్రాజెక్టు అయితే కేంద్రమే రాష్ట్రానికి ఇచ్చింది. కేంద్రానికి అంటే (ప్రధానమంత్రి మోదీకి) అంత సమర్దత లేదని, తాను అయితేనే ప్రాజెక్టు నిర్మించగలనని చెప్పి కేంద్రమే తనకు అప్పగించిందని చంద్రబాబు చెప్పినప్పుడు ఈమె ఎందుకు మాట్లాడలేకపోయారు?.
ఏపీకి సంబంధించి నిధులు,జాతీయ రహదారులు అధికంగా సాధించడంలో ఏపీ వైసిపి ఎమ్.పిలు సఫలం అయ్యారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రశంసించారు. పురందేశ్వరి విమర్శలన్నింటికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఒకటే సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇచ్చి ఆ క్రెడిట్ మీరే తీసుకోండని అన్నారు. మరి ఇందుకు పురంధేశ్వరి సిద్దపడగలరా?..
పురంధేశ్వరి కనుక టీడీపీకి ప్రత్యామ్నాయంగా పార్టీని అబివృద్ది చేయలేకపోతే ఆమెకు ఈ పదవి ఇచ్చినా పెద్ద ప్రయోజనం ఉండదు.
గతంలో టీడీపీ నుంచి , ప్రత్యేకించి చంద్రబాబు నుంచి అనేక అవమానాలను దగ్గుబాటి కుటుంబం ఎదుర్కొంది. అంతదాకా ఎందుకు, 2014లో ఆమె విశాఖ లేదా ఒంగోలు వంటి లోక్ సభ నియోజకవర్గాన్ని ఆశిస్తే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు కలిసి ఆమెను రాజంపేట పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది. రాజకీయాలలో పదవులపై మోజు ఉన్నా.. ఆత్మాభిమానం తగ్గించుకోకూడదు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్.కుమార్తె అయిన పురందేశ్వరి కాంగ్రెస్ ఎమ్.పి అవడానికి ఎవరో సహకరించారో ఆమెకు తెలియదా? అదే ఆమె రాజకీయ జీవితానికి నాందీ అయి, తదుపరి కేంద్ర మంత్రి అయ్యారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో ఆమె బీజేపీలోకి వచ్చేశారు. ఇక్కడ కూడా పార్టీ పరంగా మంచి పదవులే వచ్చాయి. ఇంతరకు ఆమెకు ఎంతో కొంత మంచిపేరే ఉంది. వ్యక్తిత్వం ఉన్న నేతగానే గుర్తింపు పొందారు. కాని బిజెపి అధ్యక్షురాలు అయ్యాక అచ్చం టిడిపి గొంతుకగా మారితే మాత్రం ఆమెకు తీరని అప్రతిష్టే మిగులుందని చెప్పకతప్పదు.
::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment