విజయవాడ : కాపుల సామాజిక, రాజకీయ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పిలుపు మేరకు శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో కాపుల రిజర్వేషన్కు మద్దతుగా రెండు రోజుల నుంచి నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడ పీసీసీ కార్యాలయం ఆవరణలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షను కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలోకి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారా అని ఎత్తులు వేయడం మానేసి, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజలు లేని పార్టీ, ప్రభుత్వాలు ఎంతోకాలం నిలబడలేవని హెచ్చరించారు.
ఎన్నికల హామీలను మరచి అత్యంత దారుణంగా భవిష్యత్తులో ప్రతిపక్షం లేకుండా చేయాలనే తలంపుతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారన్నారు. హామీలను నెరవేర్చమంటున్న ముద్రడగ పట్ల నిరంకుశంగా వ్యవహరించడం దారుణమన్నారు. కాపుల రిజర్వేషన్, ముద్రగడ దీక్షపై టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎవరికి వారు మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం.. కాపుల సామాజిక, రాజకీయ అభివృద్ధికి ఈ రెండేళ్లలో ఏం చేసిందో చెప్పాలన్నారు. అదే విధంగా టీడీపీలో రెండు కులాల వారిదే ఆధిపత్యం, వారికే కాంట్రాక్టులుగానీ, టెండర్లుగానీ.. అన్నీ వారే చూస్తారు, వారే చేస్తారన్నారు. ఈ సమావేశంలో కాపు సాధికారత విభాగం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆకులు శ్రీనివాస్, పి.సూరిబాబు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
'కాపులకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలి?'
Published Thu, Jun 16 2016 7:40 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
Advertisement