'ముద్రగడ' వార్తలపై ముఖ్యమంత్రి అక్కసు
విజయవాడ: కాపులకు రిజర్వేషన్ డిమాండ్ తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన దీక్షకు మీడియా ప్రాధాన్యం ఇవ్వటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కసు వెళ్లగక్కారు. ఓ వైపు ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో ప్లీట్ రివ్యూ నిర్వహిస్తే.. ఆ వార్తలను వదిలి దీక్ష వార్తలను రాసి ప్రభుత్వాన్నికి చెడ్డపేరు ఆపాదించే ప్రయత్నం చేశారని విలేకరులపై చిందులేశారు.
'నేను ఎన్నో దేశాలు తిరిగా. ఎన్నెన్నో కార్యక్రమాలకు హాజరయ్యా. కానీ విశాఖపట్నంలో నిర్వహించిన ప్లీట్ రివ్యూ లాంటిది చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దాన్ని ఘనంగా నిర్వహించినందుకు నేను గర్వపడుతున్నా. అయితే అంత ఇంపార్టెంట్ వార్తలు వదిలి ఎవరో నన్ను తిట్టారనే వార్తలు ప్రధానంగా రాయడంలో అర్థమేమిటి? ' అంటూ ముద్రగడ దీక్ష వార్తలను ఉద్దేశించి బాబు మండిపడ్డారు. తనను తిట్టిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తిట్టినవాళ్లకు ప్రాచుర్యం కల్పిస్తున్నారని సీఎం అన్నారు.
ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే ముద్రగడ దంపతులు దీక్ష విరమించారన్న ముఖ్యమంత్రి.. కాపుల్లో కూడా చాలామంది పేదవాళ్లు ఉన్నారని, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిది నెలల్లోగా మంజునాథన్ కమిటీ రిపోర్టు వస్తుందని, కాపు కార్పొరేషన్ కు ఏటా రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. తుని ఘటనపై విచారణ కొనసాగుతున్నదని, రైలు దహనం కేసులో బాధ్యులపై కఠినచర్యలు తప్పవని వ్యాఖ్యానించారు.