మైదానంలో పనులను పరిశీలిస్తున్న అర్షద్ అయూబ్, హెచ్‌సీఏ అధికారులు
పాలమూరులో మాడల్ క్రికెట్ గ్రౌండ్
Published Fri, Aug 26 2016 10:26 PM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
– అకాడమీతో క్రీడాకారులకు మేలు
– హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో మాడల్ క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్ అన్నారు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో పిల్లలమర్రి సమీపంలో ఏర్పాటు చేస్తున్న క్రికెట్ మైదానం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే లెవలింగ్ పనులు పూర్తయ్యాయని, మరో మూడు నెలల్లో మైదానాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. మైదానంలో పెవిలియన్ బిల్డింగ్, గదులు, జిమ్ సెంటర్ నిర్మించి భవిష్యత్‌లో రెండో అంతస్తులో అకాడమీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇక్కడి క్రికెట్ మైదానం ఏర్పాటు అనంతరం బీసీసీఐ అధికారులు పరిశీలించి సంతప్తి వ్యక్తం చేస్తే రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలో ఈ మైదానంలో అండర్–16, అండర్–19 రాష్ట్రస్థాయి మ్యాచ్‌లు నిర్వహిస్తామని చెప్పారు.
జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందన్నారు. అంతర్ జిల్లా లీగ్ మ్యాచుల్లో రాణించేవారు కంబైన్డ్ జట్టులో ఉంటారని, అక్కడ నైపుణ్యం ప్రదర్శించే వారు రాష్ట్ర జట్లకు ఎంపికవుతారని తెలిపారు. మండలస్థాయిలో క్రికెట్ విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. టెన్నిస్ బాల్‌తో కూడా టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించారు. డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి నైపుణ్యం గల వారిని గుర్తించి, వారికి జిల్లాస్థాయిలో మెరుగైన శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. సమావేశంలో హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి జాన్ మనోజ్, కోశాధికారి దేవరాజ్, క్యూరేటర్ చంద్రశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేశ్‌కుమార్, వెంకటరామరావు, కోశాధికారి ఉదేశ్‌కుమార్, కోచ్‌లు గోపాలకష్ణ, అబ్దుల్లా, మన్నాన్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement