మహబూబ్‌నగర్–నిజామాబాద్ జట్ల మధ్య మ్యాచ్
-
వరుసగా రెండో లీగ్‌లో గెలుపు
-
నిజామాబాద్‌పై 152పరుగుల తేడాతో భారీ విజయం
-
అర్ధసెంచరీతో రాణించిన హర్షవర్ధన్
-
హెచ్‌సీఏ అండర్–19 క్రికెట్ టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–19 క్రికెట్ టోర్నీలో ఆతిథ్య పాలమూరు జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జిల్లా స్టేడియంలో జరిగిన కీలక రెండో లీగ్ మ్యాచ్‌లో జిల్లా జట్టు 152 పరుగులు భారీ ఆధిక్యతతో నిజామాబాద్‌ను చిత్తు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జిల్లా జట్టు నిర్ణీత 46ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 253పరుగులు చేసింది. ఓపెనర్ హర్షవర్ధన్ (48 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు) అర్ధసెంచరీతో రాణించారు. మరో ఓపెనర్ షాకీర్‌ఖాన్ (27), ఖయ్యుం (29)ఫర్వాలేదనిపించారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో 159 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి జిల్లా జట్టు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన అర్జున్ (43 నాటౌట్: 42 బంతుల్లో 3 ఫోర్లు), మంజునాథ్ (43 నాటౌట్: 26బంతుల్లో 4 ఫోర్లు)లు చివర్లో మెరుపు బ్యాటింగ్ చేసి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 94పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ స్కోరును అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నిజామాబాద్ బ్యాట్స్‌మన్ జిల్లా బౌలర్ల ధాటికి విలవిలలాడారు. ఆ జట్టు 32.3ఓవర్లలో 102పరుగులకే కుప్పకూలింది. లలిత్‌రెడ్డి (29), అఖిల్(26) మాత్రమే కాస్త పోరాడారు. పాలమూరు బౌలర్లలో అబ్దుల్ రహెమాన్, ఖయ్యుం నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. గ్రూప్–ఏలో చివరి లీగ్ మ్యాచ్‌లో గురువారం జిల్లాస్టేడియంలో మహబూబ్‌నగర్‌తో ఆదిలాబాద్‌తో తలపడనుంది.
టోర్నీలో విజేతగా నిలవాలి
అండర్–19 రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్టు మళ్లీ విజేతగా నిలవాలని మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ మనోహర్‌రెడ్డి అన్నారు. ఉదయం స్టేడియంలో మహబూబ్‌నగర్–నిజామాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఏక్రాగత, సమష్టిగా ఆడాలని కోరారు. జిల్లాలో నైపుణ్యం గల క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తే మరింతగా రాణిస్తారని అన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్, వెంకటరామారావు, కోచ్‌లు అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌పై నెగ్గిన కరీంనగర్
జడ్చర్లటౌన్: జడ్చర్ల ఎర్రసత్యం స్మారక క్రీడామైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు 42పరుగుల తేడాతో ఆదిలాబాద్‌ను ఓడించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు నిర్ణీత 47ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఆ జట్టులో అజయ్‌రెడ్డి (104: 109 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేసి, జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మరో బ్యాట్స్‌మన్ సిద్ధార్థ్‌రెడ్డి (56: 73 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ఆదిలాబాద్ బౌలర్లలో రోహన్ మూడు, ప్రదీప్, సైఫ్ అలీ చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు. 239పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆదిలాబాద్ 43.4 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయ్యారు. జట్టులో ఒంటరిపోరాటం చేసిన సైఫ్ ఆలీ (95: 113 బంతుల్లో 6 ఫోర్లు)కి మరో ఎండ్‌లో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా సహకరించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కరీంనగర్ జట్టులో అశోక్ మూడు, విష్ణు, సిద్ధార్థ్‌రెడ్డి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. గురువారం ఇదే మైదానంలో కరీంనగర్–నిజామాబాద్ జట్లు తలపడనున్నాయి.